నల్లబెల్లి, ఏప్రిల్ 8: బదిలీలు సరే.. తాము గ్రామాల అభివృద్ధి కోసం వెచ్చించిన బాకీల సంగతేంటని పంచాయతీ కార్యదర్శులు అధికారులు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు కార్యదర్శుల బృందం మంగళవారం వరంగల్ కలెక్టర్ సత్యశారదను కలిసి మొరపెట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధిలోని నల్లబెల్లి మండలంలో 29 మంది కార్యదర్శులు, చెన్నారావుపేట 30 మంది, దుగ్గొండి 34, ఖానాపురంలో 21, నెక్కొండలో 39 మంది, నర్సంపేట రూరల్లో 19 కలిపి మొత్తం 172 మంది కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు.
సర్పంచ్ల పదవీ కాలం ముగిసి 14 నెలలు అవుతున్నది. నాటి నుంచి అన్ని గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా మంజూరు చేయలేదు. దీంతో కార్యదర్శులు అప్పులు తెచ్చి ప్రధానంగా జీపీ కార్యాలయంలో నెలవారీ స్టేషనరీ, గ్రామాల్లో తాగునీరు, వీధిలైట్లు, పారిశుధ్య సమస్యలు పరిష్కరిస్తున్నారు.
మేజర్ జీపీలకు రూ. 6 లక్షల నుంచి రూ. 7 లక్షలు, చిన్న జీపీల కార్యదర్శులకు రూ. 2 లక్షల నుంచి రూ. 2.50 లక్షల వరకు రావాల్సి ఉంది. ఈ క్రమంలో బిల్లులు చెల్లించకుండా అకస్మాత్తుగా వేరే ప్రాంతాలకు బదిలీ చేస్తే తమకు రావాల్సిన బాకీల సంగతేంటని కార్యదర్శులు జిల్లా అధికారులతోపాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.