పర్వతగిరి : మండల కేంద్రంలోని పెద్ద చెరువు రిజర్వాయర్, పోలకమ్మ చెరువు మధ్య ఉన్న వంద ఎకరాల పట్టా భూములు వరద నీటితో మునిగిపోతున్నాయని బాధిత రైతులు కలెక్టరేట్ గ్రీవెన్స్ కలెక్టర్ సత్యశారదకు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ పెద్ద చెరువు రిజర్వాయర్‌కు తూములు పటిష్టంగా నిర్మించకపోవడంతో నీరు లీకై సుమారు వంద ఎకరాలు మునిగిపోతున్నాయని వాపోయారు. మూడేళ్లుగా పంటలు సాగుచేయలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే పెద్ద చెరువు రిజర్వాయర్ తూములు (షెట్టర్లు) మరమ్మతు చేయించాలని కోరారు. పోలకమ్మ చెరువు నీటి విడుదలకు రెండు తూములకు గేట్లు ఏర్పాటు చేయాలని, ఈ చెరువు చిన్న మత్తడికి పూర్వం ఎస్సీకాలనీ పక్కనున్న బుంగను పూడ్చాలని కోరారు. పెద్ద చెరువు నీటిని చేపలవేట కోసం ఇష్టానుసారంగా విడుదల చేస్తున్న మత్స్యకారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉన్న పెద్ద చెరువు రిజర్వాయర్ నుంచి పోలకమ్మ చెరువు వరకు ఉన్న పంటలకు నీటి వసతి కల్పించి, కాల్వను సీసీతో పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. పోలకమ్మ చెరువు ముంపు బాధిత రైతులు సంగారపు రమేశ్, చిన్నపెల్లి దేవేందర్, బొట్ల కనకరాజు, అర్షం యుగేందర్, సంకినేని పూలమ్మ, బొట్ల వెంకన్న, కాసర్ల ప్రభాకర్, బొట్ల రమేశ్, అర్షం యాకయ్య, బొట్ల పూలమ్మ, పుష్పమ్మ, ఉప్పలమ్మ, సింగారపు నర్సయ్య, ఆకులపెల్లి యాకయ్య, చిర్ర సుమన్ వినతిపత్రం సమర్పించారు.