హనుమకొండ సబర్బన్, డిసెంబర్ 24: యాసంగి పంటలకు సంబంధించి లోయర్ మానేరు డ్యాం(ఎల్ఎండీ) నుంచి కాకతీయ కాల్వకు శనివారం అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ మేరకు ఈఎన్సీ శంకర్ స్విచ్ఛాన్ చేసి నీటిని దిగువకు పంపించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కొత్త ప్రాజెక్టులతో సాగు నీటి సౌలభ్యం పెరిగింది. దీంతో ప్రతి సీజన్లో కాల్వ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో 2022-23 యాసంగి పంటకు పాత పద్ధతి(ఆఫ్ అండ్ ఆన్)లో 15 వారాల పాటు నీరు అందుబాటులో ఉంటుంది. అంటే ఏప్రిల్ చివరి వారం వరకు నీరు పంటలకు అందుబాటులో ఉంటుంది. టెయిల్ ఎండ్ రైతులకు కూడా సాగు నీరు పుష్కలంగా అందనుంది. సూర్యాపేట జిల్లాకు కూడా కాకతీయ కాల్వ ద్వారా నీరు అందుతుంది.
ప్రస్తుతం ఎల్ఎండీలో 21.9 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. దీనికి తోడు ఎగువన ఉన్న మధ్యమానేరు, శ్రీపాద ప్రాజెక్టుల్లో సైతం కావాల్సి మేరకు నీటిని నిల్వ ఉంచారు. దీంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టులో అతి ముఖ్యమైన కన్నెపల్లి పంపుహౌస్ సైతం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఆరు మోటర్లు ఎత్తిపోతలను ప్రారంభించాయి. ఎల్ఎండీలో ఉదయం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు క్రమక్రమంగా 4 వేల క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కాల్వ మరమ్మతులను సైతం గతంలోనే పూర్తి చేశారు. ఎక్కడా కూడ నీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా జాత్రత్తలు తీసుకున్నారు. అన్ని డిస్ట్రిబ్యూటరీలను(డీబీఎం) సైతం తనిఖీ చేసిన తర్వాతనే నీటిని విడుదల చేశారు. ఆయకట్టు రైతులు దాదాపు వరి నాట్లు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం నీటిని విడుదల చేయడం వల్ల కూలీల కొరత కూడా కొంత మేరకు తగ్గే అవకాశం ఉంది. మొత్తానికైతే కాల్వ నీటిని విడుదల చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.