వరంగల్ లీగల్, మే 31: రాజముద్ర నుంచి కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ చిహ్నాలను తొలగించి ఓరుగల్లు గౌరవాన్ని దిగజార్చేలా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీరును ఖండిస్తున్నామని.. చిహ్నాల తొలగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే మరోసారి ఉద్యమిస్తామని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మాతంగి రమేశ్‌బాబు హెచ్చరించారు. ఈ సందర్భంగా శుక్రవారం వరంగల్ కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసన తెలిపారు. సీనియర్ న్యాయవాది ముద్దసాని సహోదర్‌రెడ్డి మాట్లాడుతూ చరిత్రను పరిశీలిస్తే కాకతీయ రాజులు ప్రజారంజక పాలన అందించి వారి ఆర్థిక ఎదుగుదలకు ఎంతో తోడ్పడ్డారన్నారు. ఆ రోజుల్లోనే దూరదృష్టితో గొలుసుకట్టు చెరువుల ద్వారా 70వేల గ్రామాలకు నీటి సౌకర్యం కల్పించారని పేర్కొన్నారు. మరో సీనియర్ న్యాయవాది మహేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల మేధావులు, రాజకీయ నాయకులను సంప్రదించిన తర్వాతే రాజముద్రను ఆమోదించార ని, ఆనాడు అభ్యంతరం తెలుపని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజముద్రను మార్చడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. కాకతీయ కళాతోరణంతో పాటు చార్మినార్ కూడా అత్యంత ప్రాధాన్యత కలిగిన చిహ్నాలని, వాటి గౌరవం తగ్గించేలా ఎవరు ప్రవర్తించినా ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు తాళ్లపల్లి జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాజముద్రలో అమరవీరుల స్తూపాన్ని చేర్చడం సరైందే ఐనప్పటికీ తెలంగాణ యువకులు మలిదశలోగాని తొలి దశలోగాని తమ ప్రాణాలను త్యాగం చేయడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ అన్నది చరిత్ర తెలిసిన వారందరికీ తెలిసిన విషయమేనన్నారు. అమరుల చావులకు కారణమైన వారే ఈరోజు అమరవీరుల స్తూపం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఉద్యమంలో ఏనాడూ పాల్గొనని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకరోజైనా తెలంగాణ స్తూపం వద్ద నివాళులర్పించకుండా అమరవీరుల స్తూపం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కళాతోరణం, చార్మినార్‌ను తొలగించాలన్న ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం శాశ్వతంగా విరమించుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ అధ్యక్షుడు వినోద్‌కుమార్ మాట్లాడుతూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ తీరును ముక్తకంఠంతో ఖండిస్తున్నా మని చెప్పారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, వారి మనోభావాలను దెబ్బతీస్తే రేవంత్‌రెడ్డి భారీ మూల్యం చెల్లించు కోక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో న్యాయవాదులు శ్యామ్‌సుందర్‌రావు, సంసాని సునీల్, అబ్దుల్ నబీ, శివ రాజు, వసంత్ యాదవ్, మహేశ్ పటేల్ కిరణ్‌కుమార్, రాము పాల్గొన్నారు.