వరంగల్‌చౌరస్తా, నవంబర్ 15: నకిలీ వైద్యం వికటించి యువకుడు ప్రాణాపాయస్థితికి చేరుకున్న ఘటన వరంగల్‌లో జరిగింది. వరంగల్ జిల్లా చింత నెక్కొండ ప్రాంతానికి చెందిన మాడూరు రజినీకాంత్ అర్షమొలల సమస్యతో బాధపడున్నా డు. ఖానాపురం మండలం మంగళవారిపేటకు చెందిన కౌసల్య, ఆర్ఎంపీ చిట్టిబాబు ఈ నెల 13న అతడికి అశాస్త్రీయంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ క్రమంలో బాధితుడికి అధిక రక్తస్రావం కావడంతో ప్రాణాపాయస్థితికి చేరుకున్నాడు. వెంనే కుటుంబ సభ్యులు రజినీకాంత్‌ను వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానకు తరలించారు. అతడి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యస్థితి ఇబ్బందికరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పబ్లిక్ రిలేషన్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ నరేశ్‌కుమార్ ఆధ్వర్యంలో వివరాలు సేకరించారు. అర్హత లేకుండా, అశాస్త్రీయ పద్ధతిలో వైద్యం చేసి యువకుడి ప్రాణాలకు హాని కలిగించిన ఆర్‌ఎంపీతోపాటు సహకరించిన వారిపై మెడికల్ కౌన్సిల్ చట్ట ప్రకారం చర్యలు చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.