హనుమకొండ చౌరస్తా : మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, యోగ అనేది శరీరానికి మాత్రమే కాదు మనస్సుకు కూడా ప్రశాంతత కలిగించే మార్గమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండ వేయి స్తంభాల గుడి ప్రాంగణంలో కేంద్ర పురావస్తు శాఖ, తెలంగాణ రాష్ట్ర ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయనతోపాటు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య కూడా యోగా డే వేడుకలకు హాజరయ్యారు.
శిక్షణ పొందిన యోగా నిపుణులు ప్రత్యేకంగా యోగాసనాలు వేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని, యోగా అనేది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలని సూచించారు. భారతీయ సంస్కృతికి యోగా చిరునామా అని అన్నారు. ప్రపంచమంతా మన సంప్రదాయలను ఆదరించేలా చేసిన ఆత్మీయ సాధన యోగా అని కొనియాడారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా వైద్యశాల అధికారి అప్పయ్య, నాయకులు నాయిని లక్ష్మారెడ్డి, సుగుణాకర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు కుమార్ యాదవ్, మాడిశెట్టి సతీష్, యోగ నిపుణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.