‘నీ స్వార్థ రాజకీయాలకోసం మా పిల్లలే దొరికిండ్రా?’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. హిందీ ప్రశ్న పత్రం బయటకు రావడంతో ఇక మొత్తం పరీక్షలు రద్దవుతాయేమోనని ఆందోళన పడ్డామని, తమ పిల్లల భవిష్యత్తు ఏంటని దిగులు చెందామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా కొట్లాడాలిగానీ, ఇలా పిల్లలను అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూడడం ఏం పద్ధతి అని నిలదీస్తున్నారు. పేపర్ లీక్ ఘటనలో బాధ్యులను విడిచిపెట్టొద్దని ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈ ఘటన దురదృష్టకరమని, ఇలాంటి వాటితో ఇటు పిల్లలు, అటు టీచర్లలో ఆత్మస్థయిర్యం దెబ్బతింటుందని వాపోయారు. పరీక్షల్లో మంచి ఫలితాల కోసం విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ఉపాధ్యాయులు ఎంతో కష్టపడ్డారని, ఒకవేళ పరీక్షలు రద్దయితే బాగా చదివే పిల్లలు కూడా నష్టపోతారని, ఇలాంటి స్వార్థ రాజకీయాల్లోకి విద్యార్థులను లాగడం సమంజసం కాదని హితవు పలికారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 6 : తన స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తమ పిల్లలతో చెలగాటమాడుతున్నారని పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది పాటు రేయింబవళ్లు కష్టపడి చదివి విద్యార్థులు పరీక్షలు రాస్తుంటే కుట్రలతో పదో తరగతి హిందీ ప్రశ్నపత్రాన్ని లీక్ చేయించి పిల్లల భవిష్యత్‌తో ఆటలాడజూశారని విమర్శించారు. రాజకీయంగా కొట్లాడాలే తప్ప ఇలా విద్యార్థులను మధ్యలోకి లాగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమ పిల్లలు సెంటర్లోకి వెళ్లి, పరీక్ష ప్రారంభమైన తర్వాత పేపర్ లీక్ అయినట్లు సామాజిక మాధ్యమాల్లో చూసి ఎంతో ఆందోళన చెందామని, మొదట తెలుగు, తర్వాత హిందీ పేపర్ కూడా బయటకు రావడంతో పరీక్షలను రద్దు చేస్తారేమోనని టెన్షన్‌కు గురయ్యామని వాపోయారు.
పిల్లలు ఇంటికి వచ్చాక పేపర్ లీక్ అయిందని ఆందోళన చెందారని చెప్పారు. పరీక్షలు రద్దయితే పిల్లల పరిస్థితి ఏమిటని, ఒకవేళ పరీక్షలు రద్దయితే బాగా చదివే పిల్లలు కూడా వెనుకబడిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపడంతో ఊపిరిపీల్చుకున్నామని చెప్పారు. ఇలాంటి ఘటనలు విద్యార్థులనే కాకుండా, ఉపాధ్యాయులను కూడా ప్రభావితం చేస్తాయని, వారిలో ఆత్మస్థయిర్యం దెబ్బతింటుందని పలువురు ఉపాధ్యాయులు చెప్పారు. విద్యార్థులను సన్నద్ధం చేసి మంచి ఫలితాలు వచ్చేందుకు ఉపాధ్యాయులు ఎంతో శ్రమిస్తారని, ఇలాంటి ఘటనలు జరిగితే ఫలితాలపై ప్రభావం పడి తమ శ్రమ అంతా వృథా అవుతుందని టీచర్లలో కూడా కలవరం నెలకొంటుందని చెబుతున్నారు. ఒకవేళ పరీక్షలు రద్దయితే విద్యార్థులు కుంగిపోతారని, బాగా చదివే పిల్లలు కూడా వెనుకబడిపోతారని, ఇలా స్వార్థ రాజకీయాల కోసం విద్యార్థుల భవిష్యత్‌ను పణంగా పెట్టడం సరికాదని హితవు పలుకుతున్నారు.
విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం
దేవరుప్పుల: కొందరు కావాలని పనికట్టుకుని విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం ఆడుతున్నారు. మరోవైపు సంబంధం లేని వ్యవహారంలో ఉపాధ్యాయులు బలవుతున్నారు. భయం తో డ్యూటీలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. విద్యార్థులు ఏడాది కష్టపడి చదివిన చదువు ఇలాంటి వాటితో వెనుకబడతారనే మానసిక వేదన తల్లిదండ్రుల్లో నెలకొంది. పరీక్షలు మళ్లీ రాయాల్సి వస్తుందేమోనన్న గందరగోళం ఉంది. లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షించాలి. ఎంతటివారైనా వదలొద్దు. ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందనే నమ్మకం ఉపాధ్యాయ లోకానికి ఉంది. రెండు రోజులుగా జరుగుతున్న సంఘటనలపై ఇటు విద్యాశాఖ, అటు పోలీసులు సత్వరంగా స్పందించారు.
– కొల్ల మహిపాల్‌రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, జనగామ
రాజకీయంగ కొట్లాడాలె కాని ఇవేం పనులు..
ములుగు, నమస్తే తెలంగాణ: నా బిడ్డ దేవగిరిపట్నం మైనార్టీ స్కూల్లో చదువుతాంది. ఎగ్జామ్ రాస్తదని నేను పాలంపేట నుంచి పని పోగొట్టుకొని సెంటరు కాడికి వచ్చిన. పేపర్ లీక్ అయిందని నా బిడ్డ చాలా బాధపడ్డది. ఏం కాదు తియ్యి బిడ్డ పేపర్ బయటకు తెచ్చిన దొంగలను జైళ్ల పెట్టిళ్లు. ధైర్యంగ పరీక్షలు రాయి. మంచిగ చదువుకో అని చెప్పిన. పేపర్‌ను లీక్ చేస్తే ఏం వస్తది. రాజకీయంగ కొట్లాడాలె. పిల్లల జీవితాలతోటి ఆడుకోవద్దు. బండి సంజయ్‌ది మంచి పద్ధతి కాదు. విద్యార్థుల జీవితాలను మధ్యలోకి లాగి రాజకీయం చేయడం తప్పు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే.
– దండెపెల్లి రమేశ్, పాలంపేట, వెంకటాపూర్(ములుగు)
టెన్షన్పడ్డాం..
మహబూబాబాద్, నమస్తే తెలంగాణ: మా పాప ఏడాది నుంచి కష్టపడి చదువుతోంది. హిందీ పేపర్ లీక్ అయ్యిందని తెలిసి బాధపడ్డాం. పరీక్షను రద్దు చేస్తే ఎట్లా అనే అనుమానాలు మొదలయ్యాయి. అప్పటికే మా పాప జ్వరంతో బాధపడుతూనే పరీక్షలు రాస్తోంది. ఈ విషయం తెలిసి కుంగిపోయింది. పేపర్ లీక్ టెన్షన్‌తో జ్వరం మరింత ఎక్కువైంది. ఇంత కష్టపడి పరీక్ష రాస్తే అంతా వేస్ట్ అయ్యిందా డాడీ అని బాధపడింది. తర్వాత రాసే పరీక్షలపై ఈ ప్రభావం పడుతుందని గుర్తించి మా పాపను గైడ్ చేశాను. పార్టీలు ఏమైనా ఉంటే రాజకీయంగా చూసుకోవాలి తప్ప ఇలా పేపర్ లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం సమంజసం కాదు.
– ఇస్లావత్ దస్రరాం, అమనగల్(మహబూబాబాద్)
రాష్ట్ర ప్రభుత్వం భరోసా..
జయశంకర్ భూపాలపల్లి, నమస్తే తెలంగాణ: పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ అయిందన్న వార్తలు ఆందోళనకు గురిచేశాయి. మెరుగైన ఫలితాలు సాధించడానికి విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. వారితో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కష్టం కూడా ఉంది. చివరికి ప్రశ్నప త్రాల లీకేజీ వల్ల తమ పిల్లల భవిష్యత్ ఏమవుతుందోననే తీవ్ర నిరాశ, నిస్పృహలకు తల్లిదండ్రు లు లోనయ్యారు. ఒకవేళ వాయిదా పడితే మళ్లీ పరీక్షలు రాయడానికి ఏ మేరకు సంసిద్ధంగా ఉంటారనే సందేహం నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ సకాలంలో స్పందించి పూర్తి భరోసా కల్పించడం అభినందనీయం. మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలి.
– కామిడి సతీశ్‌రెడ్డి, పీఆర్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు
దోషులను విడిచిపెట్టొద్దు..
చిట్యాల: కొంత మంది రాజకీయ అవసరాల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడడం సరికాదు. వరంగల్‌లో ప్రశ్నపత్రం లీక్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పాత్ర ఉందని పోలీసులు నిర్ధారించడంతో ఈ విషయం బట్టబయలైంది. పనికి పంపించకుండా ఇబ్బందులు పడుతూ నా కొడుకును కష్టపడి చదివించిన. కానీ ప్రశ్నపత్రం లీక్ అయిందని మస్తు భయపడ్డ, మల్ల ఎటు దారి తీస్తుందోనని. సర్కారు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపించడం మంచిదైంది.
– నందికొండ పాపిరెడ్డి
బీజేపీతో గందరగోళం
నర్సంపేట రూరల్: బీజేపీ నేతలు టెన్త్ విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తున్నారు. పదో తరగతి హిందీ పరీక్ష పత్రం లీకేజీకి ప్రధాన కారకుడైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పోలీసులు, న్యాయస్థానం తగిన బుద్ధి చెప్పింది. విద్యార్థులు కష్టపడి ఏడాది పొడవునా ప్రిపరేషన్ అయి ప్రశాంతంగా పరీక్షలు రాసే సమయంలో ప్రశ్నపత్రం లీకేజీతో విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. బీజేపీ నేతలు ఇంత దిగజారుడు తనానికి పాల్పడడం సిగ్గు చేటు. రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించడం హర్షించదగిన విషయం.
– మండల రాజమౌళి, ఇటుకాలపల్లి, నర్సంపేట
కుట్రలకు టీచర్లను బాధ్యులు చేయొద్దు
వర్ధన్నపేట: పరీక్ష ప్రశ్నపత్రాలను తప్పుడు మార్గాల్లో బయటకు తీసుకువచ్చి ఎన్నో ఆశలతో కష్టపడి చదివి పరీక్షలు రాసే విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం సరికాదు. మంచి మార్కులు సాధించడం కోసం ఉపాధ్యాయులంతా కష్టపడ తాం. విద్యార్థులు మంచి మార్కులు సాధించి జీవితంలో స్థిరపడితే తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా సంతోష పడతారు. కానీ కొంత మంది కుట్రలు చేసి ప్రశ్నపత్రాలను బయటకు తెప్పించడం సరికాదు. ఈ పనులకు ఉపాధ్యాయులను బాధ్యులను చేయడం వల్ల వారిలో ఆత్మైస్థెర్యం దెబ్బతిని పరీక్షలను నిర్వహించడం ఇబ్బందిగా మారుతుంది. లీకేజీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంకోసారి అలా జరుగకుండా ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను తీసుకురావాలి.
– బొజ్జ గణేశ్, ఉపాధ్యాయ సంఘం బాధ్యుడు, వర్ధన్నపేట
రాజకీయ లబ్ధి కోసమే..
ఏటూరునాగారం: రాజకీయ లబ్ధి కోసమే పేపర్ లీకేజీ దుమారం రేపుతున్నారు. ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయడానికే దీన్ని తెరపైకి తెస్తున్నట్లుగా ఉంది. పరీక్ష కేంద్రం నుంచి ప్రశ్నపత్రం బయటకు వచ్చిన తర్వాత వాటికి సంబంధించి జవాబు చీటీలు తిరిగి సెంటర్ లోపలికి రాలేదంటే ఇది విద్యార్థుల కోసం కాదనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. బీజేపీ అనుబంధ సంఘాలకు చెందిన వారితోనే ఇది జరిగింది. విద్యార్థు ల కోసం అయితే పరీక్షా పత్రాన్ని వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేయాల్సిన అవసరం లేదు. పేపర్ లీక్ వార్త తెలిసిన వెంటనే పిల్లలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎక్కడ పరీక్షలు రద్దు చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. ఇన్విజిలేషన్ డ్యూటీ కూడా నిబద్ధతతో చేయాల్సిన అవసరం ఉంటుంది.
మానసికంగా ఇబ్బంది
హనుమకొండ: ప్రశ్నపతరం లీకైందని మా కూతురు మానసికంగా ఇబ్బంది పడింది. మొదటి తెలుగు పేపర్ లీక్ అయిందంటే, రెండో రోజు కూడా హిందీ పేపర్ లీక్ అయ్యిందంటూ వార్తలు రావడంతో ఆందోళన చెందాం. దీంతో అసలు పరీక్షలు కొనసాగుతాయా.. రద్దు అవుతాయా.. అనే సందిగ్ధంలో ఉన్నాం. పరీక్షలు జరుగుతాయని, ఏమీ ఇబ్బంది పడొద్దని మా అమ్మాయికి అవగాహన కల్పిస్తూ ధైర్యం చెప్పాం.
– దాసరి శ్రీనివాస్, ప్రశాంత్‌నగర్, హనుమకొండ
ఆందోళన మొదలైంది..
హనుమకొండ: పదో తరగతి పరీక్షల ప్రశ్నపత్రం లీకేజీతో అసలు ఎగ్జామ్స్ నడుస్తాయో నడువవో అనే ఆందోళన మొదలైంది. మా అమ్మాయి సంవ త్సరం అంతా కష్టపడి చదివింది వేస్ట్ అవుతుందా అని బాధపడ్డాం. పదో తరగతిలో మంచి మార్కులు వస్తేనే లాభం. ప్రశ్నపత్రం లీక్ చేయడంతో విద్యార్థులు అయోమయానికి గురవు తున్నారు. ఒక పొజిషన్లో ఉండి ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నా రో అర్థం కావడం లేదు.
– కే సుజాత, హనుమకొండ
పేపర్ లీకైందని భయపడ్డా..
మహబూబాబాద్, నమస్తే తెలంగాణ: పరీక్ష రాసి బయటకు వచ్చే సరికి హిందీ ప్రశ్నపత్రం లీక్ అయ్యిందని తెలిసి భయపడ్డా. పరీక్ష రద్దు చేస్తారా.. మళ్లీ రాయాలా అనే ఆందోళన మొదలైంది. ఇంత కష్టపడి చదివి పరీక్షా బాగా రాస్తే లీక్ అనే సరికి చాలా డల్ అయ్యాం. మా సార్లు వచ్చి విద్యార్థులు ఎవరూ అధైర్యపడవద్దని ధైర్యం చెప్పి తరువాత పరీక్షకు ప్రిపేర్ అయ్యేలా చూశారు.
– బీ యశ్విత, విద్యార్థిని
ప్రభుత్వానికి ధన్యవాదాలు…
పదో తరగతి పరీక్షలను ఆపకుండా కొనసాగిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాధాలు. నా కొడుక్కు 10/10 మార్కులు వస్తాయనుకున్నాం. టెన్త్ పేపర్లు లీకైన వార్తలతో పరీక్షలు ఎక్కడ ఆగిపోతాయేననే భయం పట్టుకుంది. రెండు రోజులు లీకైన ఘటనలు వెలుగు చూడడంతో పిల్లల చదువుపై ప్రభావాన్ని చూపెట్టాయి. సంవత్సరం పాటు బాగా చదువుకుని ఫైనల్ పరీక్షలకు సిద్ధమయ్యారు. పరీక్ష కేంద్రాల వద్దకు వెళ్లినప్పుడు తల్లిదండ్రులు పేపర్ లీకు ఘటనలపై మాట్లాడు కుంటే భయమేసింది. ప్రభుత్వం పరీక్షల పరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది.
– కొండేటి మంజుల, బాపూజీనగర్(కాజీపేట)
కఠినంగా శిక్షించాలి
మహదేవపూర్: పదో తరగతి తెలుగు, హిందీ ప్రశ్నపత్రం వాట్సాప్ గ్రూప్‌లో చక్కర్లు కొట్టడంతో విద్యార్థుల తల్లిదండ్రులు గందరగోళానికి గురయ్యారు. నిన్న మొన్నటి వరకు బాగా చదివి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు లీకేజీ విషయంతో ఏకాగ్రతను కోల్పోతున్నారు. పరీక్షలు రద్దు చేస్తారేమోనన్న అనుమానం వ్యక్తమవుతోంది. పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధ్యులను కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుడా పటిష్ట చర్యలు చేపట్టాలి.
– చల్ల మహేందర్, కుదురుపల్లి(మహదేవపూర్)
వైరల్ చేయడం సరికాదు
నర్సంపేట: పేపర్ లీకైందని తెలిస్తే ఓ ప్రజాప్రతినిధిగా అధికారులకు పంపించాలి కానీ వైరల్ చేయడం సరికాదు. దీనివల్ల పిల్లలు అయోమయానికి గురై ఆందోళన చెందుతారు. కమలాపూర్‌లో ఇన్విజిలేటర్‌కు తెలువకుండానే ఆకతాయిలు పేపర్‌ను ఫొటో తీసి వైరల్ చేశారు. దీనికి ఉపాధ్యాయులను బాధ్యులను చేసి చర్యలు తీసుకోవడం సరికాదు. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం ఎంత వరకు సబబు. ఇకనైనా పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలి.
– ఈదునూరి రవీందర్‌రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, వరంగల్