హనుమకొండ/వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 17 : వరంగల్ నగరంలో నాలాలు, ప్రభుత్వ భూముల కబ్జాలపై ఉక్కుపాదం మోపనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా మంగళవారం వరంగల్, హనుమకొండ కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వరంగల్‌లో కలెక్టర్ సత్యశారద, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి ఖిలా వరంగల్‌లోని అమరుల స్తూపానికి నివాళులర్పించి, సభావేదికకు చేరుకొని జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసు గౌరవ వందనం స్వీకరించారు.
హనుమకొండ కలెక్టరేట్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, బల్దియా కమిషనర్‌తో కలిసి సమీక్షించారు. ఆయాచోట్ల మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలను అమలుచేశామని, 500కు గ్యాస్ సిలిండర్ పథకం 39.5లక్షల మందితో ప్రారంభమై ప్రస్తుతం 43లక్షల మందితో నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు.
గృహజ్యోతి పథకం ద్వారా 48.62 లక్షల మంది లబ్ధిపొందుతున్నారని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్ల చొప్పున ప్రతి ఆర్థిక సంవత్సరంలో 4లక్షల 50వేల ఇండ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఇంటి నిర్మించుకునే పేదలకు రూ.5లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. వరద బాధిత కుటుంబాలకు రూ.16,500, పంట నష్టం జరిగిన ప్రతి ఎకరాకు రూ.10వేల పరిహారం అందిస్తామని, ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. ములుగు, నర్సంపేట మెడికల్ కళాశాలలకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి లభించిందని తద్వారా మరిన్ని మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు.
తెలంగాణలో రెండో అతిపెద్ద నగరంగా ఉన్న వరంగల్‌ను 2050 సంవత్సరానికి అనుగుణంగా మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తామని, నాలాల విస్తరణకు చర్యలు చేపట్టి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌లను బలోపేతం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరమైన వరంగల్ నగరాభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారని, అందుకే తనకు ఇన్చార్జి మం త్రి బాధ్యతలు అప్పగించారని చెప్పారు. స్మార్ట్‌సిటీ నిధులు విడుదలయ్యేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆధునిక శాస్త్ర సాంకేతికతతో వరంగల్ మోడల్ బస్‌స్టేషన్‌ను నిర్మిస్తామని తెలిపారు.
నాలాలు, చెరువుల్లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఇంటి నిర్మాణాలు చేపట్టిన వారి జాబితా సిద్ధం చేయాలని అధికారులను మంత్రి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. ఎంతటి వారైనా సరే తొలగిస్తామన్నారు. బీపీఎల్ కుటుంబాలుంటే వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. పేదలను ఇబ్బందులు పెట్టమని బడాబాబులను వదిలిపెట్టేది లేదని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి రెండు కళ్లలాంటి విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
పేదలకు పెద్దదిక్కైన వరంగల్ ఎంజీఎంలో మందుల కొరతపై మంత్రి సీరియస్ అయ్యారు. పేషెంట్లు బయటకు వెళ్లి ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొనడమేమిటని ఆగ్రహం వ్యకంచేసిన ఆయన కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పేదలకు వైద్యం అందించే విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు పొరుగు ఉన్న ఛత్తీస్‌గఢ్ నుంచి వైద్యం కోసం పేదలు వస్తుంటారని, సాకులు చెప్పకుండా అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పా రు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంజీఎం దవాఖానను రెగ్యులర్‌గా సందర్శించి వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. దవాఖానలో ఫిర్యాదులను స్వీకరించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ముప్పు నుంచి ప్రజలను రక్షించిన హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, అధికారులను మంత్రి అభినందించారు. పాత్రికేయులకు తప్పకుండా ఇంటి స్థలాలు ఇస్తామని అర్హుల జాబితాను ఆయా కమిటీలు అందిస్తే స్థలాలు కేటాయించేందుకు ప్రభు త్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆయా యూనియన్లు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డితో చర్చించాలని సూచించారు.
కాళోజీ కళాక్షేత్రాన్ని వచ్చే నెల 2న సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపా రు. ఇన్నర్, ఔటర్ రింగ్‌రోడ్డు, కాజీపేట ఆర్వోబీ పనులకు పూర్తి చేయాలన్నారు. అలాగే వరంగల్ విమానాశ్రయం విషయ మై ఆర్అండ్బీ మంత్రితో చర్చించనున్నట్లు తెలిపారు. డంపింగ్ యార్డ్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, బల్దియా కమిషనర్‌ను ఆదేశించారు.
వరంగల్ నగరంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఈమేరకు అధికారులు నగరాభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలన్నారు. ఎంజీఎం దవాఖానలో సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారు స్థలాలు చాలా చోట్ల కబ్జాకు గురయ్యాయని ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వరంగల్ ఎంజీఎం అభివృద్ధికి, వసతుల కల్పనకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని మంత్రిని కోరారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ కేంద్రం నుంచి వరంగల్ అభివృద్ధికి నిధులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్లు వెంకట్‌రెడ్డి, సంధ్యారాణి, ఆర్డీవో వెంకటేశ్, కుడా పీవో అజిత్‌రెడ్డి పాల్గొన్నారు.
వరంగల్ చౌరస్తా : ఎంజీఎంలో మరింత మెరుగైన వైద్యసేవలు అందించడానికి కృషి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంత్రి కొండా సురేఖతో కలిసి ఆయన ఎంజీఎం బ్లడ్‌బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం అందించిన సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ కలెక్షన్ మిషన్‌ని ఆయన ప్రారంభించారు. వైరల్ పీవర్స్, డెంగ్యూ లాంటి ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడినప్పుడు అవసరమయ్యే వైద్యసేవల్లో సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ ఎంతో ము ఖ్యపాత్ర పోషిస్తాయని, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో రూ.12వేల ఖర్చయ్యే ఈ వైద్యసేవలను ఎంజీఎంలో ఉచితంగా అందుబాటులో ఉంటుందన్నారు. ఆ తర్వాత ఓపీ విభాగంతో పాటుగా ఆరోగ్యశ్రీ వా ర్డు, మెడికల్ వార్డులతోపాటు డైట్ కిచెన్లను పరిశీలించారు. ఎంజీఎంలో అందుతున్న సేవలను గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. పిల్లల విభాగంలో మందు లు అందుబాటులో లేవని అటెండెంట్ రాజు మంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే పరిశీలించి అన్ని రకాల మందు లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆశించా రు. పిల్లల వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారులకు అందుతున్న వైద్యసేవల ఆరా తీయాలని ఎంపీ కావ్యను కోరారు. అనంతరం కేఎంసీలోని నెఫ్రాలజీ విభాగంలో డయాలసిస్ సెంటర్ మంత్రి సురేఖ, ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాయినితో కలిసి ప్రారంభించారు. ప్రస్తుత అవసరాలను దృష్ట్యా మరో 10 డయాలసిస్ యూనిట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. అనంతరం అంతర్గత రోడ్లకు శంకుస్థాపన చేశారు.