నమస్తే నెట్వర్క్, జూలై 30 : వరద సృష్టించిన బీభత్సానికి సర్వం కోల్పోయిన ప్రజలకు సర్కారు భరోసానిస్తోంది. ఇల్లు, పొలాలు, పాడి పశువులు, అయినవాళ్లు దూరమై ఆగమైన కుటుంబాలను ఓదార్చి మేమున్నామని ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం ధైర్యం చెబుతోంది. ఏమాత్రం ఆందోళన వద్దని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇస్తూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రతి కుటుంబానికి కొండంత అండగా నిలుస్తూ వారి అవసరాలను తెలుసుకొని సేవలను అందిస్తున్నారు. ఆదివారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం బూర్గుపేటలో రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ పర్యటించారు.
వరద ఉధృతితో దెబ్బతిన్న చెరువును, ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి, రెడ్కో చైర్మన్ ఏరువ సతీశ్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి, ఎస్పీ గౌష్ ఆలంతో కలిసి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేశ్మిశ్రాతో కలిసి నిత్యావసర కిట్లను వరద బాధితులకు అందజేశారు. కేసముద్రం మండలం అర్పనపల్లిలో 45 కుటుంబాలకు నిత్యావసర సరుకులను ఎంపీ, బీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అందజేశారు. వరదలతో దెబ్బతిన్న రోడ్లు, వంతెనల మరమ్మతులు, విద్యుత్ పునరుద్ధరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా ఎక్కడికక్కడ వైద్యశిబిరాల్లో మందులు అందిస్తున్నారు.
ఒక్కో కిట్‌లో 19 వస్తువులు..
జిల్లాకేంద్రం నుంచి నిత్యావసర సరుకులు వరద ముంపు ప్రాంతాలకు లారీల్లో చేరుకుంటున్నాయి. ఒక్కో కుటుంబానికి ఒక్కో బ్యాగ్ చొప్పున 19 రకాల సరుకులను అందిస్తున్నారు. ఇందులో 3 కిలోల ఉల్లిగడ్డలు, కిలో కందిపప్పు, కిలో పెసరపప్పు, 2 లీటర్ల పల్లినూనె ప్యాకెట్లు, అరకిలో చింతపండు, 200 గ్రామల పసుపు, 100 గ్రాముల టీపోడి, 2 బట్టల సబ్బులు, 2 స్నానం సబ్బులు, 200 గ్రాముల కారంపోడి, కిలో ఉప్పు ప్యాకెట్, 100 గ్రాముల దనియాపోడి, 100గ్రాముల జీలకర్ర, 2 కిలోల ఉప్మా రవ్వ, అర కిలో అల్లం, ఎల్లిగడ్డలు, అరకిలో చక్కెర, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, బిస్కెట్ ప్యాకెట్లను కలిపి ఒక కిట్‌గా ఇస్తున్నారు. దీంతో పాటు బట్టలను కూడా అందిస్తున్నారు. ఈ కిట్లను రెండు లారీల ద్వారా ద్వారా వెంకటాపూర్, తాడ్వాయి, ఏటూరునాగారం, వాజేడు, వెంటాపురం(నూగూరు), కన్నాయిగూడెం మండలాలకు తరలించారు. ఆయా మండలాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు వరద బాధిత కుటుంబాలకు అందించే పనిలో నిమగ్నమయ్యారు. అంతేగాక స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు, ట్రస్ట్‌ల ద్వారా వరద బాధితులకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు.