హనుమకొండ సిటీ, జూలై 17: బీటెక్‌లో ప్రవేశాల కోసం 18 నుంచి 20వ తేదీ వరకు ఎంసెట్ నిర్వహించేందుకు నగరంలోని పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. కంప్యూటర్ బేస్డ్ (సీబీటీ) అయినందున రోజుకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 కేంద్రాలు ఏర్పాటు చేయగా, హనుమకొండలో తొమ్మిది, నర్సంపేటలో రెండు సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 13,695 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. హనుమకొండలో 10,095, నర్సంపేటలో 3,600 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 9 నుంచి పరీక్ష ప్రారంభం కానున్నందున రెండు గంటల ముందు నుంచే విద్యార్థులను సెంటర్లలోకి అనుమతిస్తారు. 11 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 33 మంది పరిశీలకులు, ఇద్దరు ప్రత్యేక పరిశీలకులు విధులకు హాజరు కానున్నారు.
పరీక్ష కేందాల వివరాలు..
ఎర్రగట్టు గుట్టలోని కిట్స్, భీమారంలోని ఎస్వీఎస్, చింతగట్టులోని నోబుల్ టెక్నాలజీ అండ్ సొల్యూషన్, కిషన్‌పురలోని చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ, పద్మాక్షీ కాలనీలోని జయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హంటర్‌రోడ్‌లోని గణపతి ఇంజినీరింగ్ కాలేజ్, బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాల, గోపాలస్వామి టెంపుల్లోని వశిష్ట టెక్నాలజీ, సోమిడిలోని తాళ్ల పద్మావతి ఇంజినీరింగ్ కాలేజ్, నర్సంపేటలోని జయముఖి ఇంజనీరింగ్ కాలేజీ, నర్సంపేటలోని బాలాజీ ఇంజినీరింగ్ కాలేజీలో సెంటర్లు ఏర్పాటు చేశారు. నిమిషం నిబంధనను పక్కా అమలు చేస్తామని రీజినల్ కోఆర్డినేటర్ ఆచార్య కోలా ఆనంద్ కిశోర్ తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్‌తోపాటు గుర్తింపు కార్డుతో పరీక్షకు హాజరు కావాలని సూచించారు. వాటర్ బాటిల్, శానిటైజర్ బాటిల్‌ను వెంట తెచ్చుకోవాలని కోరారు. బయోమెట్రిక్ అటెండెన్స్ అనంతరం విద్యార్థులను లోపలికి అనుమతిస్తారని తెలిపారు.