రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో జీడబ్ల్యూఎంసీ అధికారులు చేపట్టిన నాలాల విస్తరణ, పూడికతీత పనులు సత్ఫలితాలనిస్తున్నాయి. వరుసగా వర్షాలు కురుస్తున్నా రూ.25 కోట్లతో చేపట్టిన పనులతో నగరం ముంపునకు గురికావడం లేదు. ఆక్రమణలు, కట్టడాల తొలగింపుతో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు నయీంనగర్, సమ్మయ్యనగర్, భద్రకాళి నాలాల ద్వారా ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా పోతోంది. వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, కమిషనర్ ప్రావీణ్య పలుమార్లు నగర నాలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేపట్టిన నాలాల విస్తరణ, పూడిక తీత పనులు సత్ఫలితాలనిస్తున్నాయి. వరుసగా ఆరు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసినా నగరం సేఫ్‌గా ఉంది. ముందస్తు ప్రణాళికల్లో భాగంగా అధికారులు నెల రోజులుగా నాలాల పూడిక తీత పనులతో పాటు నాలాలపై ఉన్న ఆక్రమణలు తొలగించిన విషయం తెలిసిందే. గతంలో నాలాలు పూడికపోయి గంట వర్షానికే నగరమంతా ముంపునకు గురయ్యేది. రెండేళ్ల కిత్రం రెండుమూడు గంటల వర్షానికి నగరం జలదిగ్బంధంలో చిక్కుకున్న సంఘటనలు ప్రజలు ఇప్పటికీ మరచిపోలేదు. అప్పటి సంఘటనలు పునరావృతం కాకుండా గ్రేటర్ అధికారులు చేపట్టిన ముందస్తు చర్యలతో వరద నీరు నాలాల ద్వారా సాఫీగా పోతోంది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలు ఆచరణలో పెట్టడంతో నగరం సేఫ్‌గా ఉంది. నాలా ఆక్రమణలు, కట్టడాలను వెంటనే తొలగించి నాలాల విస్తరణ చేపట్టాలని ప్రత్యేకంగా రూ. 25 కోట్లు మంజూరు చేశారు. ఆ నిధులతో చేపట్టిన పనులతో నగరం ముంపునకు గురికాకుండా ఉంది.
ముంపునకు గురికాని కాలనీలు..
నగరంలో నాలాలా ద్వారా వరద నీరు సాఫీగా పోతోంది. కొన్ని నెలల కింద చేపట్టిన నాలాల విస్తరణ, ఆక్రమణల తొలగింపు, పూడికతీత పనులతో వరద నీరు రోడ్డెక్కడం లేదు, ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నయీంనగర్, సమ్మయ్య నగర్, భద్రకాళి నాలాల ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా పోతోంది. వర్షాలు మొదలైన రోజు నుంచి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, కమిషనర్ ప్రావీణ్య పలు సార్లు నగర నాలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. అదనంగా యంత్రాలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు చేపట్టిన ముందస్తు చర్యలతో నగరం వరద ముంపునకు గురికాకుండా సేఫ్‌గా ఉంది.
అలుగుపోస్తున్న నగర చెరువులు
వర్షాలకు నగరంలోని భద్రకాళి, వడ్డేపల్లి చెరువులు అలుగు పోస్తున్నాయి. చెరువులు నిండు కుండాలా కనిపిస్తున్నాయి. భద్రకాళి చెరువు, వడ్డేపల్లి చెరువులు మత్తడి పోస్తుండడంతో అక్కడ యువకుల సందడి పెరిగింది. మత్తడి చూసేందుకు నగర యువకులు చెరువుల దగ్గరకు వస్తున్నారు. మత్తడి పోస్తున్న చెరువుల వద్ద చేపలను పడుతున్నారు.