పరకాల, జూన్ 18 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలన చేస్తోందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించారు. పరకాలలో శనివారం పరకాల, నడికూడ, ఆత్మకూరు, దామెర మండలాలకు చెందిన 361 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పాలన చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో గడపగడపకూ సంక్షేమ ఫలాలు అందే విధంగా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.
మన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా మారాయని అన్నారు. రూ.50 వేలతో ప్రారంభించిన కల్యాణలక్ష్మి పథకం కింద ప్రస్తుతం రూ.లక్షా నూటపదహారు అందజేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 37,571కోట్ల రూపాయలను కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని అందించినట్లు పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర ఆదాయం పెరిగితే ఎస్టీ, బీసీ, పేద ఓసీలకు బంధును అమలు చేసే విధంగా సీఎం కేసీఆర్ ప్రణాళిక చేస్తున్నారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాజకీయ పబ్బం గడుపేందుకు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణలో ఉన్న పథకాలు అమలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. చిత్తశుద్ధి లేని ప్రతిపక్ష పార్టీల నేతల మాటలు తెలంగాణ ప్రజలు నమ్మొద్దన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో నిరంకుశ, మతతత్వ పాలన చేస్తుందన్నారు. అగ్నిపథ్ నిర్ణయం సైనిక దళాల్లో చేరే యువతకు ఇబ్బంది కలిగిస్తుందని తెలిపారు. అగ్నిపథ్ ఆందోళనలో మృతి చెందిన దామెర రాకేశ్ది కేంద్ర ప్రభుత్వ హత్యేనని అన్నారు. రాష్ర్టానికి పరిశ్రమలు, విద్యాలయాలు కేటాయించని బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. కార్యక్రమంలో పరకాల మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితారామకృష్ణ, వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బండి సారంగపాణి, పలు మండలాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు,