గిర్మాజీపేట, జూన్ 18 : ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన రుణ మంజూరులో సంబంధిత బ్యాంకు అధికారులు ఎలాంటి జాప్యం చేయొద్దని కలెక్టర్ బీ గోపి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో బ్యాంకర్లతో త్రైమాసిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్య, పశు సంవర్థకశాఖ లబ్ధిదారులకు 1,714 కిసాన్ క్రెడిట్ కార్డులు మంజూరు చేసినందుకు బ్యాంకర్లను అభినందించారు. అలాగే, పెండింగ్‌లో ఉన్న 2,796 దరఖాస్తులను ప్రతి శుక్రవారం జరిగే క్యాంప్‌లో పరిష్కరించాలని డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ(డీసీసీ) సభ్యులకు సూచించారు.
2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.1,641 కోట్ల పంట రుణాలు, రూ.903 కోట్ల పరిశ్రమ రుణాలు, రూ.34 కోట్ల విద్యా రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. 2022-23 సంవత్సరానికి రూ.2,631కోట్ల జిల్లా ప్రణాళికను కమిటీ విడుదల చేసిందన్నారు. విద్య, వ్యవసాయ రుణాలను మంజూరు చేయాలన్నారు. కోటక్, డీబీఎస్ బ్యాంక్ సీడీ రేషియో 60 శాతం తక్కువగా ఉందని, వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీని కలెక్టర్ కోరారు.
ఫుడ్ ప్రాసెసింగ్ కింద వచ్చిన రుణాలను తక్షణమే ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు. డీఆర్డీఏ, మెప్మా ద్వారా బ్యాంక్ సహకారంతో ప్రతి సంవత్సరం ఒక గ్రూప్‌కు ఎకనామిక్ యాక్టివిటీ కింద రూ. 20 లక్షలు రుణం మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. అలాగే, బ్యాంకు రుణాల పంపిణీలో అత్యుత్తమ సేవలకు గాను నర్సంపేట, సంగెం, గీసుగొండ ఐకేపీ ఏపీఎంలు కుందేళ్ల మహేందర్, కిషన్, సురేశ్‌కుమార్‌తో పాటు సీసీ సుజాత, వీవోఏ సుధాకర్‌కు కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భూక్యా హరిసింగ్, ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రాజేంద్రప్రసాద్, ఎల్డీఎం దేవసాని సత్యజిత్, నాబార్డ్ డీడీఎం చైతన్యరవి, డీఆర్డీవో సంపత్‌రావు, యూబీఐ డిప్యూటీ జనరల్ సత్యం, రీజినల్ మేనేజర్లు అలీముద్దీన్, శ్రీధర్‌రెడ్డి, మాధవి తదితరులు పాల్గొన్నారు.