వరంగల్ లీగల్, జూన్ 1 : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా కొత్త జిల్లా కోర్టులు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. న్యాయస్థానాల చరిత్రలో నవ శకం ఆవిష్కృతం కానుది. కొత్తగా ఏర్పడిన జిల్లాలకు ప్రత్యేక జిల్లా కోర్టులు కూడా ఉంటేనే పాలన సంపూర్ణమవుతుందని, అందుకోసం రాష్ట్ర యంత్రాగం, హైకోర్టు కొత్త జిల్లాల్లో జిల్లా కోర్టుల ఏర్పాట్లకు పూనుకున్నాయి. ఇప్పటివరకూ వరంగల్ జిల్లా కోర్టు పరిధిలో ఉన్న జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగుతో పాటు వరంగల్ జిల్లాలకు కొత్త కోర్టులు మంజూరయ్యాయి.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా కొత్తగా నియమితులైన జిల్లా ప్రధాన జడ్జిల చేతుల మీదుగా జెండాల ఆవిష్కరణ కార్యక్రమం జరుగనుంది. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేతులమీదుగా గురువారం సాయంత్రం ఆన్లైన్ పద్ధతిలో జిల్లా కోర్టులు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. వరంగల్ జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తి కొకా రాధాదేవి, హనుమకొండలో ఎం కృష్ణమూర్తి, జయశంకర్ భూపాలపల్లిలో శ్రీనివాసాచారి, జనగామలో శైలజ, మహబూబాబాద్‌లో పాటిల్ వసంత్, ములుగులో లలితాశివజ్యోతి జాతీయ జెండాలు ఎగురవేయనున్నారు. ఇప్పటివరకు వరంగల్ జిల్లా కోర్టుగా ఉన్న కోర్టు పరిధిని హనుమకొండ కోర్టుగా మార్చి, ఇదే ఆవరణలోని సబ్‌కోర్టు భవనంలో వరంగల్ జిల్లా కోర్టును ఏర్పాటు చేశారు.