రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా నిర్వహించే ఉత్సవాలపై బుధవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి సూచనలు చేశారు. వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి హాజరవుతారని, ఉదయం 9గంటలకు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి, అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. సాయంత్రం 6గంటలకు డీఆర్డీఏ కార్యాలయ ఆవరణలో కవి సమ్మేళనం ఉంటుందని కవులు, సాహిత్య అభిమానులు హాజరుకావాలని కలెక్టర్ కోరారు. కాగా ఆవిర్భావ వేడుకల కోసం సమీకృత కలెక్టరేట్ ముస్తాబుచేయడంతో పాటు మహిళలు అందమైన ముగ్గులతో తీర్చిదిద్దారు.
జనగామ చౌరస్తా, జూన్ 1 ః జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో కఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్లో నిర్వహించే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బ్యాండ్ ఏర్పాటు చేసి గౌరవ వందనం నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి ఉదయం 9 గంటలకు కలెక్టరేట్లోని అమర వీరుల స్తూపానికి నివాళులర్పించిన అనంతరం జాతీయ పతాకావిష్కరణ చేసి గౌరవ వందనం స్వీకరిస్తారని తెలిపారు. ఈ వేడుకలకు అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది ఉదయం 8.30 గంటల వరకే హాజరుకావాలని కలెక్టర్ శివలింగయ్య ఆదేశించారు. సాయంత్రం 6 గంటలకు జిల్లా కేంద్రంలోని హనుమకొండ రోడ్డు మార్గంలోని డీఆర్డీఏ కార్యాలయం ఆవరణలో ‘కవి సమ్మేళనం’ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ శివలింగయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కవులు, సాహిత్య అభిమానులు హాజరుకావాలని కలెక్టర్ శివలింగయ్య కోరారు.
ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు..
కలెక్టర్ కార్యాలయంలో నేడు జరిగే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య నేతృత్వంలో జిల్లా అధికారులు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టరేట్ ఆవరణలో సభా వేదికతో పాటు తెలంగాణ అమర వీరుల స్తూపం, జాతీయ జెండా గద్దెలను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ ఆవరణ అంతా కూడా పండుగ వాతావరణంలో కొత్త శోభను సంతరించుకుంది. మహిళా కార్మికులు కలెక్టరేట్ ప్రవేశ మార్గం వద్ద అందంగా ముగ్గులు వేసి సందడి చేశారు.