తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నేత కార్మికుల ఆర్థికాభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నది. ఇకపై రైతులకు మాదిరిగానే నేతన్నలకు బీమా పథకం వర్తింపజేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నది. 59 సంవత్సరాల్లోపు వారందరికీ రూ.5లక్షల బీమా అందించేందుకు కసరత్తు చేస్తున్నది. ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా విధివిధానాలు రూపొందిస్తున్నది. పథకం పక్కాగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు సదరు అధికారులు చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో విస్తృతంగా చర్చలు జరిపారు. లబ్ధిదారుల వివరాలు సేకరించి, జియో ట్యాగింగ్ ద్వారా పేర్లు నమోదు చేశారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 1622 మందికి లబ్ధి చేకూరనుండగా, చేనేత కుటుంబాలు సంబురాలు చేసుకుంటున్నాయి.
– పోచమ్మమైదాన్, మే 27
పోచమ్మమైదాన్, మే 27 : రాష్ట్ర ప్రభుత్వం ‘నేతన్నకు బీమా’ పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నది. ఈ పథకం కింద రూ.5లక్షలను ఎల్ఐసీ ద్వారా అందించనుంది. దీని కోసం ప్రత్యేకంగా రూ.29.98 కోట్లు మంజూరు చేసింది. నేతన్నల పేరుపై ప్రభుత్వమే ఎల్ఐసీ ప్రీమియం చెల్లించనుంది. దీంతో చేనేత కార్మికుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. వారి కుటుంబాల్లో చీకట్లను పారదోలేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని సంబురపడుతున్నారు. దురదృష్ణవశాత్తు నేతన్న మరణిస్తే కుటుంబం రోడ్డున పడకుండా ఉంటుందని చెబుతున్నారు.
లబ్ధి పొందే వారు..
జిల్లాలో 63 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో 28 చేనేత సంఘాలు, 35 మ్యాక్స్ సంఘా లు పనిచేస్తున్నాయి. ఆయా సంఘాల్లో 4148 చేనేత కార్మికులుండగా, 1388 సభ్యుల పేర్లను జియో ట్యాగింగ్ ద్వారా నమోదు చేశారు. అలాగే, పథకంలో చేరే కార్మికుల పేర్లను సంబంధిత సంఘాల నుంచి జిల్లా అధికారులు సేకరించి, ఉన్నతాధికారులకు పంపించారు. ఇందులో చేనేత, పవర్లూమ్ కార్మికులతో పాటు యాన్సిలరీ వర్కర్స్(అనుబంధ కార్మికులు)కు అవకాశం కల్పించారు. జిల్లాలో జియోట్యాగింగ్ అయిన కార్మికులు 1388మంది ఉండగా 59 సంవత్సరాల్లోపు 911మంది, 59 సంవత్సరాలపైన 477 మంది ఉన్నారు. 1075 అనుబంధ కార్మికుల్లో 59 సంవత్సరాల్లోపు 711 మంది, 59 సంవత్సరాలపైన 364 మంది కార్మికులు ఉన్నారు. మొత్తంగా జిల్లాలో 1622 మంది లబ్ధి పొందనున్నారు.
కార్మికుల్లో అభద్రతాభావం వీడింది..
– యెలుగం సాంబయ్య, షత్రంజి చేనేత సహకార సంఘం అధ్యక్షుడు
తెలంగాణ ప్రభుత్వం నేతన్న బీమా పథకం ప్రవేశపెట్టడంతో నేత కార్మికులకు అభద్రతా భావం వీడింది. చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వీవర్స్‌కు ప్రభుత్వం మనోధైర్యం కల్పించింది. రైతన్నల మాదిరిగా నేతన్నలు కూడా భరోసాతో బతికే పరిస్థితులు వచ్చాయి.
సర్కార్‌కు రుణపడి ఉంటాం..
– అడిచెర్ల రవి, నేత కార్మికుడు, కొత్తవాడ
నేతన్నలకు ఉచిత బీమా అమలు చేయడం మాలో ఆనం దం నింపింది. తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. ఇప్పటికే కార్మికులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం మరో పథకం తీసుకొస్తుండడం మాలో ధైర్యం నింపింది. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
కార్మికులకు ఉపశమనం…
– చేనేత, జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాధికారెడ్డి
నేతన్న బీమా పథకం చేనేత కార్మికులకు ఎంతగానో ఉపశమనం కలిగిస్తుంది. 59సంవత్సరాల్లోపు కార్మికులందరికీ పథకం వర్తింపు కోసం ప్రభుత్వం విధి విధానాలను రూపొందిస్తున్నది. అన్ని సహకార సంఘాల అధ్యక్షులతో కమిషనర్, చేనేత సంచాలకులు విస్తృతంగా చర్చలు జరిపారు. ఎక్కువ మందికి లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నాం.