పోచమ్మమైదాన్, మే 15: జర్నలిస్టుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. దేశాయిపేట లక్ష్మీ మెగా టౌన్షిప్ సమీపంలో తూర్పు జర్నలిస్టుల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లను ఆదివారం ఆయన తూర్పు జర్నలిస్టుల సంఘం బాధ్యులు కోరుకొప్పుల నరేందర్, జక్కుల విజయ్‌కుమార్, ఆడెపు సాగర్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ కావటి కవిత, సీనియర్ జర్నలిస్టులు గాడిపల్లి మధు, కక్కెర్ల అనిల్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయించి, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతులమీదుగా తూర్పు జర్నలిస్టులకు అందజేస్తామని తెలిపారు.
జర్నలిస్టులను తన కుటుంబ సభ్యులుగా భావిస్తున్నానని, వారి సంక్షేమం కోసం ప్రత్యేక చొరవతో తెలంగాణలో ఎక్కడా లేనివిధంగా డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టుల్లో చాలామంది పేద, దిగువ మధ్య తరగతి వారు ఉన్నారని, వారికి జీతభత్యాలు పెద్దగా లేకున్నా సమాజ సేవ కోసం ఈ వృత్తిని ఎంచుకొని పని చేస్తున్నారని కొనియాడారు. జర్నలిస్టుల కోసం రూ. 50 లక్షల వరకు వెచ్చించి, డబుల్ బెడ్రూం ఇళ్లును ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. తాను ప్రత్యేక చొరవ తీసుకుని డబుల్ బెడ్రూం ఇళ్లకు మంత్రి కేటీఆర్‌తో శంకుస్థాపన చేయించానని, అలాగే ప్రారంభోత్సవం కూడా మంత్రితోనే చేయిస్తానని హామీ ఇచ్చారు.
అభివృద్ధి చెందుతున్న నగరం
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో వరంగల్ నగరం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని నన్నపునేని తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసుకున్న వరంగల్ జిల్లాకేంద్రంలో ప్రెస్‌క్లబ్ ఏర్పాటుకు తనవంతుగా స్థలంతోపాటు భవన నిర్మాణం కోసం నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
వరంగల్ నగరం పర్యాటకంగా అభివృద్ధికి అడుగులు పడుతున్నాయని ఎమ్మెల్యే చెప్పారు. అలాగే, వరంగల్‌లో త్వరలోనే కలెక్టరేట్, బస్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభిస్తామని చెప్పారు. నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తున్నానని, జర్నలిస్టులు సహకరించాలని కోరారు.