స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ఇంటి యజమానులకు త్వరలో ఈ-ప్రాపర్టీ కార్డులు రానున్నాయి. స్వామిత్వ (సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రోవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్) పథకం అమలులో భాగంగా ఎస్సీ జనాభా ఎక్కువ ఉన్న స్టేషన్ఘన్పూర్ను మొదటి పైలట్ గ్రామం ఎంపికచేశారు. డ్రోన్, ఉపగ్రహాలతో ప్రతి ఇల్లు, ఇంటి స్థలాల హద్దులు, విస్తీర్ణాన్ని సర్వే చేసి ప్రత్యేక పోర్టల్‌లో నమోదు, పరిశీలన అనంతరం గ్రామసభ ఆమోదంతో హక్కు పత్రాలు అందజేస్తారు.
స్టేషన్ ఘన్పూర్, మే 13 : స్టేషన్‌ఘన్‌పూర్ పట్టణంలోని ప్రతి ఇంటిని, ఇంటి ఖాళీ స్థలాన్ని డ్రోన్, ఉపగ్రహల ద్వారా సర్వే చేసి ప్రతి ఇంటి యజమానికి ఈ-ప్రాపర్టీ కార్డును అందజేయనున్నారు. ఈమేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ స్వామిత్వ పథకం(సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రోవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్) ద్వారా జాతీయ స్థాయిలో అమలుచేయనున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని ఐదు గ్రామాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. వీటిలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం గోధుమకంట హెచ్ఎండీఏ పరిధి, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సరస్వతిగూడ అర్బన్ సమీప గ్రామం, అలాగే గిరిజన జనాభా అధికంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లా అర్లి గ్రామంతో పాటు ఎస్సీ జనాభా అధికంగా ఉన్న స్టేషన్‌ఘన్‌పూర్ మొదటి పైలట్ ప్రాజెక్టు గ్రామంగా ఎంపిక చేశారు.
ఇందులో భాగంగా గ్రామంలోని ఇళ్లను, ఇంటి స్థలాలను, ప్రభుత్వ ఆస్తులను డ్రోన్, ఉపగ్రహాల ద్వారా ఫొటోలు తీసి హద్దులు, వాటి విస్తీర్ణాన్ని నిర్ణయించి ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఆ తర్వాత వాటిని పరిశీలించి ఇంటి యజమానులకు ఈ-ప్రాపర్టీ కార్డులు అందిస్తారు. సర్వే జరుగుతున్న సమయంలో ఇంటి స్థలం, ఖాళీ స్థలం ఎంత ఉంది?, వాటికి నాలుగు దిక్కులా హద్దులు వివరాలు, వాటికి సంబంధించిన పత్రాలు అందుబాటులో ఉంచుకొని ఇంటి ఖాళీ స్థలం హద్దుల వెంట సున్నంతో మార్కింగ్ చేసుకోవాలి. ఇంటి యజమానికి స్థలానికి సంబంధించిన ఏమైనా వివాదాలుం టే వాటి పరిష్కారానికి కొంత గడువు ఇస్తారు. డ్రోన్ కెమెరా, ఉపగ్రహల ద్వారా తీసిన ఫొటోలను కేంద్ర ప్రభుత్వం ముందుగా గ్రామ పంచాయతీలకు అందిస్తుంది. వాటిని గ్రామ పంచాయతీ అధికారులు గ్రామసభలో ఉన్నత అధికారుల సమక్షంలో చర్చించి అన్నీ సవ్యంగా ఉంటే ఈ-ప్రాపర్టీ కార్డులు జారీచేస్తారు.
స్వామిత్వ సర్వేకు గ్రామస్తులందరు సహకరించాలి. గ్రామంలో సుమారు 3,882 గృహలు, 12,721 జనాభా ఉంది. ఎస్సీలు 4,605, ఎస్టీలు 315మంది ఉన్నారు. ఈ సర్వేపై ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు ప్రజలకు అవగాహన కల్పించాలి. అవసరమైతే టాంటాం వేయించడం, పత్రికలు, సోషల్ మీడియా ద్వారా ప్రజల తెలియజేస్తాం. ఇంటి సర్వే మాదిరిగా స్వామిత్వ సర్వే జరిగే రోజు అందరూ ఇంటి వద్ద ఉండాలి. ఇంటి పత్రాలు అందుబాటులో ఉంచుకొని, తమ ఇంటి ఖాళీ స్థలాల్లో సున్నంతో మార్క్ చేసుకోవాలి. బ్యాంకులో రుణాలు, ఆస్తులను తనఖా పెట్టే సమయంలో ఈ-ప్రాపర్టీ కార్డు ఉపయోగపడుతుంది.
– తాటికొండ సురేశ్, స్టేషన్‌ఘన్‌పూర్ సర్పంచ్
స్వామిత్వ పథకంలో స్టేషన్ ఘన్‌పూర్‌ను ఎంపిక చేయడం సంతోషం. ఈ సర్వేపై డివిజనల్ పంచాయతీ అధికారులకు, మండల పంచాయతీ అధికారులకు హైదరాబాద్‌లో ఇటీవల శిక్షణ ఇచ్చారు. సర్వేకు ముందు మొదట గ్రామమంతా కలియదిరిగిన అధికారులు ఇంటి ఆవరణ ఎంత ఉంది?, నిర్మాణాలు, సరిహద్దుల వివరాలు సేకరిస్తాం. ఇంటికి సంబంధించిన ప్రతి అంగులం స్థలం కూడా నమోదవుతుంది. దీంతో గ్రామ పంచాయతీకి రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది. అక్రమ కట్టడాలు నిర్మించిన వారు క్రమబద్ధీకరించుకుంటారు. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని పై అధికారుల సూచనలతో అధికారులందరూ కలిసి విజయవంతం చేస్తాం. – ఎన్ సుధీర్‌కుమార్, ఎంపీవో, స్టేషన్ ఘన్పూర్