జనగామ చౌరస్తా, మే 13 : జనగామలో మెడికల్ కాలేజీ మంజూరుతో తన కల నేరవేరిందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. కాలేజీ ప్రారంభమయ్యాక ఫస్ట్ బ్యాచ్‌లో హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన నిరుపేద విద్యార్థుల్లో ముగ్గురిని ఎంబీబీఎస్‌ను సొంత ఖర్చులతో చదివిస్తానని ప్రకటించారు.
జనగామ రైల్వే స్టేషన్ సమీపంలోని జామియా మసీదులో సీడీఎఫ్ నిధుల నుంచి రూ.5 లక్షలతో నిర్మించిన ‘ఉర్దూ ఘర్’ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డి మాట్లాడుతూ విద్య, ఉద్యోగ రంగాల్లో ముస్లింలకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ ముస్లింలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తున్నారని ముత్తిరెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలను వినియోగించుకో వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్ పాల్గొన్నారు.