గ్రామాల అభివృద్ధి పనులు, ఖర్చులు తదితర వివరాలు తెలుసుకోవడం ఇక సులభం. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఇంట్లోనే కూర్చుని స్మార్ట్‌ఫోన్‌లో ఒక్క క్లిక్‌తో గ్రామపంచాయతీల ఆర్థిక లావాదేవీలను పరీక్షించవచ్చు. సమయం కూడా ఆదా అవుతుంది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు పూర్తి పారదర్శకంగా ‘ఈ-గ్రామస్వరాజ్’ యాప్‌ను రూపొందించాయి. గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని వివరాలను పొందుపర్చి సమాచారం తెలుసుకోవచ్చు.
ములుగు, మే12(నమస్తేతెలంగాణ): గాంధీజీ కళలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి గ్రామాల రూపురేఖలను మార్చి దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతోంది. ప్రతి నెల జనాభా ప్రాతిపదికన నిధులు విడుదల చేస్తూ అభివృద్ధి పనులను జరిపిస్తున్నది.. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని పంచాయతీ రాజ్‌శాఖ ఆధ్వర్యంలో గ్రామాల ఆర్థిక లావాదేవీలను ప్రజలకు పారదర్శకంగా చూపించేందుకు సాంకేతికతను వినియోగించుకొని ఈ గ్రామ్స్వరాజ్ అనే ప్రత్యేకమైన యాప్‌ను రూపొందించింది. ఇందులో తెలంగాణలోని అన్ని జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీల ఆదాయ, ఖర్చు, అభివృద్ధి పనుల వివరాలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లు వినియోగించే వారు ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ప్లే స్టోర్‌లోకి వెళ్లి e-GramSwaraj అని టైప్ చేయగానే యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ తర్వాత వినియోగదారుడి రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామానికి సంబంధించిన వివరాలను టైప్ చేయమని అడుగుతుంది. అన్ని వివరాలను పొందిపర్చిన అనంతరం ఈఆర్ డిటేల్స్, అప్రూవుడ్ యాక్టివిటీస్, ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ అనే మూడు లోగోలు దర్శనమిస్తాయి.
అభివృద్ధి పనులు, ఖర్చుల వివరాలు సంక్షిప్తం
పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల ఖర్చు వివరాలను ఆడిట్ చేసిన అనంతరం పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ఆయా గ్రామాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను, ఖర్చు, అభివృద్ధి పనుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపర్చుతారు. ఏదేని గ్రామానికి చెందిన అభివృద్ధి పనులు, ఖర్చు, ఇతర వివరాలను తెలుసుకునేందుకు కార్యాలయాల చుట్టూ తిరుగకుండా ఈ గ్రామ్స్వరాజ్ యాప్ ద్వారా తెలుసుకునే ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు. ఆయా గ్రామాలకు చెందిన పౌరులు ఆ వివరాలు తెలుసుకునేందుకు ప్రజాప్రతినిధులు, గ్రామపంచాయతీ సిబ్బంది జీత భత్యాల వివరాలను ఈ యాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. యాప్‌లో లాగిన్ అయిన తర్వాత సంబంధిత గ్రామానికి సంబంధించిన మొత్తం పనుల సంఖ్య, ఖర్చు అయిన నిధులు, పథకానికి సంబంధించిన వివరాలు, అభివృద్ధి పని చేసిన ప్రాంతం వివరాలు వెల్లడి అవుతాయి. వీటికి సంబంధించి ప్రతి గ్రామానికి ఒక్కో యూనిక్ ఐడీతో పాటు ప్రతి పనికి ఒక్కో రిజిస్టర్ నంబర్‌ను సైతం ప్రభుత్వం పొందుపర్చింది.