నర్సంపేట రూరల్, ఏప్రిల్ 20 : నిరుపేదల మోముల్లో చిరునవ్వులు నింపడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. నర్సంపేట పట్టణం ద్వారకపేట బైపాస్ రోడ్డులో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే తొలిసారి నర్సంపేటలో ఇంటింటికీ పీఎన్జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) అందిస్తున్నామన్నారు. రూ.600 వ్యయంతోనే 45 రోజుల పాటు గ్యాస్‌ను వినియోగించుకోవచ్చన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో లేని పైప్డ్ నేచురల్ గ్యాస్ పథకాన్ని మొట్టమొదటిసారి నర్సంపేటకు తీసుకొచ్చిన ఘనత ఎమ్మెల్యే పెద్దికి దక్కుతుందని తెలిపారు. కార్యకర్త స్థాయి నుంచి జడ్పీటీసీ, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యేగా ఎదిగిన వ్యక్తి పెద్ది అని కొనియాడారు.
తెలంగాణ రాష్ట్రం రాక ముందు వ్యవసాయానికి నీళ్లు అంతగా లేకపోయేవి.. కానీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నర్సంపేట నియోజకవర్గానికి రెండు ఇరిగేషన్ ప్రాజెక్టులు మంజూరు చేశారని, రూ.670 కోట్లు వెచ్చించి 60వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చారని చెప్పారు. రాష్ట్రం రాకముందు ఎండాకాలంలో కరంటు కష్టాలు ఉండేవని, కానీ ఇప్పుడు ఒక సెకను కూడా పోకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రూ.22వేల కోట్ల రూపాయల రైతు రుణ మాఫీ చేసిన ఏకైక నాయకుడు కేసీఆరేనని మంత్రి తెలిపారు. నర్సంపేట నియోజకవర్గంలో పసుపు, పత్తి, మిర్చి బాగా పండుతుందని, అతి త్వరలో ఆహార శుద్ధి పరిశ్రమను మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. నర్సంపేట అభివృద్ధికి తక్షణమే రూ.50కోట్ల్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇంకా పెన్షన్ రాని ప్రజలకు అతి త్వరలోనే అందిస్తామన్నారు. ఎమ్మెల్యే పెద్ది రూ.100కోట్లకు పైగా నిధులను మంజూరు చేయించుకొని నర్సంపేటలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. 14ఏళ్ల పాటు కొట్లాడి రాష్ర్టాన్ని సాధించుకున్నామని, బంగారు తెలంగాణ కోసం ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ పోతున్నామని పేర్కొన్నారు. 75ఏండ్ల దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి మిషన్ భగీరథ ద్వారా నీటిని అందిస్తున్నామని తెలిపారు. ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలు చేద్దామంటే విద్యుత్ ఉండకపోయేదని, నీళ్ల కోసం కూడా ఇబ్బందులు పడేవారమని గుర్తు చేశారు.
12,600 కుటుంబాలకు లబ్ధి..
– ఎంపీ మాలోత్ కవిత
పైప్డ్ నేచురల్ గ్యాస్‌తో 12,600 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ఎంపీ మాలోత్ కవిత అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచుతున్న తరుణంలో మంత్రి కేటీఆర్ నర్సంపేట ప్రజల కోసం పైప్డ్ నేచురల్ గ్యాస్ ప్రారంభించడం సంతోషించదగిన విషయమన్నారు.
కేసీఆర్‌కు ప్రజలు రుణపడి ఉంటారు..
– జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి
నిరంతరం కష్టపడే తత్వం ఉన్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ప్రజలు రుణపడి ఉంటారని జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. తండ్రికి తగిన తనయుడు మంత్రి కేటీఆర్ అని కొనియాడారు. ఐటీ, పరిశ్రమలతో పాటు ఇతర రంగాల్లో రాష్ర్టాన్ని ముందుకు తీసుకుపోతున్నారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ బీ గోపి, అదనపు కలెక్టర్ హరిసింగ్, జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
30శాతం తక్కువ ధరకే గ్యాస్..
– ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి పైప్డ్ నేచురల్ గ్యాస్‌ను 30శాతం తక్కువ ధరతో మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో నర్సంపేటకు అందించడం గర్వించదగిన విషయమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేట నియోజకవర్గంలోని 146 గ్రామ పంచాయతీల్లో వీవో బిల్డింగ్‌ల నిర్మాణానికి పట్టాలు అందించామని తెలిపారు. 29 కుల సంఘాల భవనాలకు రూ.10కోట్లు అందించాలని ఈ సందర్భంగా మంత్రిని కోరారు.
మహిళలకు గౌరవం పెరిగింది..
– మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
గత ప్రభుత్వాల హయాంలో మహిళల ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేదని, కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కొక్కరికి రూ.3లక్షలను స్త్రీ నిధి ద్వారా అందిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. దీంతో ఆడవారికి ఎంతో గౌరవం దక్కుతోందని చెప్పారు. మన సీఎం లాంటి వ్యక్తి భారతదేశంలో ఎక్కడా లేరని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచి పేద వర్గాల ప్రజలను ఇబ్బంది పెడుతున్నదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులు బాగుపడ్డారని, 57 ఏళ్ల వారికి కొత్త పెన్షన్లు మరో 15రోజుల్లో అందిస్తామన్నారు. రూ.350కో ట్ల నిధులు వెచ్చించి గోదావరి జలాలను నర్సంపేటలోని పాకాలకు తీసుకొచ్చామన్నారు.
బీజేపీ నాయకులు ఢిల్లీకి మోకాళ్ల యాత్ర చేయాలి : మంత్రి సత్యవతి
కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచినందుకు బీజేపీ నాయకులు ఢిల్లీకి మోకాళ్ల యాత్ర చేపట్టాలని మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. 70ఏళ్లలో జరుగని అభివృద్ధి 7ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో జరిగిందన్నారు. తక్కువ ధరకే గ్యాస్ అందించడం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రత్యేక కృషికి నిదర్శనమని తెలిపారు. బీజేపీ పాపాలు పెరిగిపోతున్నాయని, తెలంగాణ రాష్ట్రంపై రూ.3వేల కోట్ల ఆర్థిక భారం పడినప్పటికీ సీఎం కేసీఆర్ ఈ దఫా వడ్ల కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు.