Kamareddy | కామారెడ్డి జిల్లా కేంద్రంలో హైటెన్షన్ నెలకొంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మధ్య మాటల యుద్ధం ఉద్రిక్తతలకు దారితీసింది. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ నేత గిరిరెడ్డి మహేందర్ రెడ్డి ప్రయత్నించారు.
ప్రభుత్వ, అరోరా కాలేజీ భూములను వెంకట రమణారెడ్డి కబ్జా చేశారని షబ్బీర్ ఇటీవల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన వెంకట రమణారెడ్డి.. ప్రభుత్వ కాలేజీ భూములు, శిశుమందిర్ పాఠశాల, అరోరా కాలేజీ విషయంలో కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలపై తాను చర్చకు సిద్ధమని తెలిపారు. కాంగ్రెస్ ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందని.. సాక్ష్యాధారాలతో చర్చకు రావాలని ఎమ్మెల్యే సవాలు విసిరారు. ఈ నేపథ్యంలో శిశుమందిర్ వేదికపై బహిరంగ చర్చకు రెండు పార్టీలు సిద్ధమయ్యాయి. ఇరు పార్టీల నేతల సవాళ్లతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి క్యాంప్ ఆఫీసు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. క్యాంప్ ఆఫీసు నుంచి బయటకు రాకుండా ఎమ్మెల్యేను హౌస్ అరెస్టు చేశారు.
మరోవైపు సవాలును స్వీకరించిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. మాజీ సర్పంచ్ గిరిరెడ్డి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఈ విషయం తెలిసిన బీజేపీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ముదరడంతో మహేందర్ రెడ్డి కారుపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. కారును బోల్తా పడేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరు పార్టీల నేతలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.