ముంబై, జూలై 31: బార్డర్లోని బ్యాంక్ శాఖల్లో దొంగ నోట్లపై ఇక గట్టి నిఘా రానున్నది. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ సరిహద్దు కలిగిన జిల్లాల్లో బ్యాంకులు నకిలీ కరెన్సీ గుర్తింపు మెషీన్లను తమ బ్రాంచీలలో ఏర్పాటు చేయాలని శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకింగ్ సంస్థలను ఓ సర్క్యులర్ ద్వారా ఆదేశించింది. అల్ట్రా-వాయిలెట్ ల్యాంప్స్నూ పెట్టాలన్నది. కాగా, నకిలీ కరెన్సీని కనిపెట్టడానికి అవసరమైన ఏర్పాట్లు దేశ సరిహద్దు ప్రాంతాల్లోని కొన్ని బ్యాంక్ శాఖల్లో లేవని ఆర్బీఐ గుర్తించింది. ఈ క్రమంలోనే సెంట్రల్ బ్యాంక్ అప్రమత్తమైంది.
ఏప్రిల్లోనే..
ఈ ఏడాది ఏప్రిల్లో జారీ చేసిన మాస్టర్ డైరెక్షన్లోనే నకిలీ కరెన్సీపై పర్యవేక్షణ, గుర్తింపు, నివేదికలపట్ల బ్యాంకులకు ఆర్బీఐ సమగ్ర రీతిలో సూచనలు చేసింది. ఏవి అసలైన నోట్లు, మరేవి నకిలీ నోట్లు అన్నదానిపై బ్యాంకు ఉద్యోగులందరికీ తప్పనిసరిగా అవగాహన ఉండాలని.. దొంగ నోట్లను ఎలా గుర్తించాలి? అందుకున్న సెక్యూరిటీ ఫీచర్లు ఏంటి? అన్నదీ తెలియాలన్నది. ఆ మేరకు ఆయా సంస్థలు శిక్షణ ఇవ్వాలని కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది. అలాగే బ్యాంకులోకి వచ్చే అన్ని నోట్లను మెషీన్ల ద్వారా కచ్చితంగా పరిశీలించాలని, నకిలీదని తేలితే ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని తెచ్చిన వ్యక్తికి తిరిగి ఇవ్వరాదని, బ్యాంకులోనూ వాటిని ధ్వంసం చేయరాదని కూడా ఆర్బీఐ వివరించింది. అయినప్పటికీ బ్యాంకులు ఈ విషయంలో తేలిగ్గా తీసుకున్నట్టు ఆర్బీఐ తాజా సర్క్యులర్ ద్వారా తేటతెల్లమవుతున్నది. ఇదిలావుంటే బ్యాంకులో నగదు నిర్వహణ చేసేవారు ఈ ఏడాది అక్టోబర్ ఆఖరుకల్లా నిర్ణీత శిక్షణను పూర్తి చేసుకొనేలా బ్యాంకులు చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ఆర్బీఐ తేల్చిచెప్పింది.
పెద్ద నోట్లు రద్దు చేసినా..
2016 నవంబర్లో మోదీ సర్కార్.. నకిలీ కరెన్సీకి చెక్ పెట్టాలని పాత పెద్ద నోట్లను రాత్రికిరాత్రి రద్దు చేసిన విషయం తెలిసిందే. అప్పటిదాకా ఉన్న రూ.500, రూ.1,000 నోట్ల స్థానంలో కొత్త రూ.500, రూ.2,000 నోట్లను పరిచయం చేసింది. ఆ తర్వాత రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లలోనూ నూతన కరెన్సీని చలామణిలోకి ప్రవేశ పెట్టింది. ఈ క్రమంలో తొలిసారి రూ.200 నోటును ముద్రించి వాడుకలో పెట్టిన కేంద్రం.. నెమ్మదిగా రూ.2,000 నోట్లను చలామణి నుంచి బ్యాంకుల ద్వారా వెనుకకు తీసుకుంటూ వస్తున్నదీ విదితమే. అయితే ద్రవ్య వ్యవస్థలో ఉన్న పాత కరెన్సీ మొత్తం దాదాపుగా బ్యాంకుల్లోకి రావడంతో దేశంలో దొంగ నోట్లు పెద్దగా లేవని, నోట్ల రద్దు అనవసరపు హంగామానేనన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. ఇక పకడబ్బందీ ఫీచర్లతో కొత్త కరెన్సీని తెచ్చామని గప్పాలు కొట్టుకున్న బీజేపీ ప్రభుత్వానికి షాక్ ఇస్తూ నకిలీ కరెన్సీ వెలుగు చూస్తుండటం మోదీ అనాలోచిత నిర్ణయాలకు నిదర్శనమన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఆర్బీఐ తాజా ఆదేశాలతో దొంగ నోట్ల బెడద పూర్తిగా పోలేదన్న వాస్తవం రుజువైందని అంతా అంటున్నారు.