నర్సంపేట, జూలై 31 : మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రత్యేకంగా నర్సంపేట నియోజకవర్గ ప్రజలు శుక్రవారం రాత్రి కన్నీటి వీడ్కోలు పలికారు. పెద్ది మృతితో నర్సంపేట విషాదంలో మునిగిపోయింది. పెద్దిని కడసారి చూసేందుకు కార్యకర్తలు, నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. ‘పెద్ది సుదర్శన్‌రెడ్డి అమర్హ్రే’ అంటూ చేసిన నినాదాలతో నర్సంపేట పట్టణం మార్మోగింది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పార్టీ రాష్ట్ర నేతలను చూడగానే మహిళలు, కార్యకర్తలు తమ ఆవేదనను కన్నీటి రూపంలో వ్యక్తంచేశారు. నల్లబెల్లిలోని పెద్ది స్వగృహం వద్ద ఆయన భౌతికకాయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ బీఆర్ఎస్ జెండాను కప్పి నివాళులర్పించారు. పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చి ధైర్యంగా ఉండాలని కోరారు. బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పట్టణంలో ఏర్పాటు చేసిన పెద్ది ఫ్లెక్సీలకు నాయకులు క్షీరాభిషేకాలు నిర్వహించారు.
కన్నీళ్లు పెట్టుకున్న హరీశ్
పెద్ది అంతిమయాత్రలో మాజీ మంత్రి హరీశ్‌రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి అంతిమయాత్రలో పాల్గొన్న ఆయన ఆప్తమిత్రుడు పెద్దితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సైతం బోరున విలపించారు. అంతిమయాత్రలో నర్సంపేట-వరంగల్, నర్సంపేట-మల్లంపల్లి ప్రధాన రహదారులపై సుమారు 3 కిలోమీటర్ల మేర ట్రాపిక్ స్తంభించగా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి క్లియర్ చేశారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి పాడెను ఎర్రబెల్లి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇతర బీఆర్ఎస్ నాయకులు మోసి కడసారి వీడ్కోలు పలికారు. అంతిమయాత్రలో మంత్రి సీతక్క, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, చల్లా ధర్మారెడ్డి, బానోత్ శంకర్‌నాయక్, బాల్క సుమన్, దాస్యం వినయ్‌భాస్కర్, అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, నాయకులు కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఏనుగుల రాకేశ్‌రెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీకి పెద్ది పేరు పెట్టాలి
నర్సంపేట పట్టణం సర్వాపురం శివారులోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు పెట్టాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కొద్దిసేపు నర్సంపేట -వరంగల్ ప్రధాన రహదారిపై విద్యార్థి సంఘాల నాయకులు బైఠాయించి నినదించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ముఖ్యనాయకులు జోక్యం చేసుకొని అంతిమయాత్ర ముందుకు కదిలేలా చర్యలు తీసుకున్నారు.