వరంగల్, జూలై 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదిగి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లిలో పుట్టిన సుదర్శన్‌రెడ్డికి చిన్నప్పటి నుంచే రాజకీయాలంటే ఇష్టంతో నల్లబెల్లిలోనే యూత్క్లబ్ను ప్రారంభించారు. తొలితరం కమ్యూనిస్టు నేతల్లో ఒకరైన మద్దికాయల ఓంకార్ (ఉమ్మడి రాష్ట్రంలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకుడు)కు, కాంగ్రెస్ నాయకుడు పెండెం కట్టయ్య మధ్య ఆరని కుంపటిగా కక్షా రాజకీయాలు సాగుతున్న దశలో పెద్ది సుదర్శన్‌రెడ్డి యూత్ కాంగ్రెస్‌లో చురుగ్గా పాల్గొనేవా రు. యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఎదుగుతున్న క్రమంలో ఓంకార్ వర్గీయులు పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇంటిపై దాడి చేసిన దాఖలాలున్నాయి. కాంగ్రెస్ కురువృద్ధుడు, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్‌రెడ్డి (ఆర్ఎస్) ప్రోత్సాహంతో నర్సంపేటలో కాంగ్రెస్ అభ్యర్థిగా బస్వరాజు సారయ్య ఓంకార్‌పై పోటీచేసిన సమయంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా పెద్ది సుదర్శన్‌రెడ్డి గడ్డి ట్రాక్టర్లో ప్రచార సామగ్రిని, కార్యకర్తలను తరలించిన సందర్భాలను స్థానికులు ఇప్పటికీ చెప్పుకొంటారు.
కేసీఆర్ నాయకత్వంలో రాటుదేలి
కేసీఆర్ నాయకత్వంలలో రాటు దేలిన నా యకుల్లో పెద్ది సుదర్శన్‌రెడ్డి ఒకరు. కాంగ్రెస్ జడ్పీటీసీ టికెట్, బీఫామ్ ఇచ్చినా వాటిని కా దని 2001లో గులాబీ జెండాను నల్లబెల్లిలో ఎగురవేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతునాగలి గుర్తుతో 12 మంది జడ్పీటీసీలుగా గెలిస్తే అందులో పెద్ది ఒకరు.
జడ్పీ ఫ్లోర్ లీడర్‌గా అవినీతిపై పోరాటం
నాడు వరంగల్ జడ్పీ టీడీపీ చేతుల్లో ఉన్న ది. పెద్ది సుదర్శన్‌రెడ్డి చురుకుదనం చూసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయనకు ఫ్లోర్ లీడర్ అవకాశం కల్పించారు. అప్పుడు జడ్పీ చైర్మన్‌గా ఉన్న బస్వారెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఆధారాలతో నిరూపించడంలో పెద్ది క్రి యాశీలకంగా వ్యవహరించారు. ఫలితంగా బస్వారెడ్డి తన జడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
‘వేం’ను ఓడించిన పెద్ది
చంద్రబాబు హవా కొనసాగుతున్న కాలమది. బీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత వచ్చిన తొలి ఎన్నికలవి. ఇంకా అప్పటికీ రాజకీయ పార్టీగా ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్టర్ కూడా చేసుకోని సమయంలో వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలు! తెలంగాణ నినాదమే వినబడకూడదు అన్నట్టు చంద్రబాబు జారీ చేసిన హు కుం. ఊరూరా పంచిన నోట్ల కట్టలు. వాటిని మోసుకొని వేం నరేందర్ రెడ్డి జడ్పీటీసీగా పోటీచేసేందుకు నల్లబెల్లికి వచ్చారు. అయితేనేం వేం ఓడిపోక తప్పలేదు. వేం నరేందర్‌రెడ్డిని ఓడించి పెద్ది సుదర్శన్‌రెడ్డి నర్సంపేట నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేశారు.
నర్సంపేట అభివృద్ధిలో ‘పెద్ది’ ముద్ర
నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తనదైన ముద్ర వేశారు. నర్సంపేటకు జిల్లా దవాఖానతోపాటు ప్రభుత్వ మెడికల్ కళాశాల ను తీసుకొచ్చారు. జిల్లా దవాఖాన, వైద్య కళాశాల ఏర్పాటుకు రూ.183 కోట్లు మం జూరు చేయించి 350 పడకల నిర్మాణం చేపట్టేందుకు చొరవ చూపారు. రూ.12 కోట్లతో వరంగల్ జిల్లాకు మంజూరైన టీ-డయాగ్నొస్టిక్ సెంటర్‌ను అధునాతన పరికరాలతో నర్సంపేటలో ఏర్పాటు చేయించారు. రూ.336 కోట్లతో గోదావరి జలాలను పాకాల సరస్సుకు రప్పించి ఈ ప్రాం త రైతాంగానికి మేలు చేశారు.