గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తాగునీటి ఎద్దడి నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. 66 డివిజన్లలో నీటిని సక్రమంగా సరఫరా చేసేందుకు పక్కాగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించారు. రూ.1.50 కోట్లతో యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. ప్రధానంగా రూ.3.8 లక్షలతో 66 లీకేజీలకు మరమ్మతులు చేస్తున్నారు. అద్దె ట్యాంకర్లను వినియోగించడంతోపాటు పాతకాలం నాటి వాల్వ్‌లను తొలగించి కొత్త వి అమర్చనున్నారు. నీటి సరఫరా విభాగం సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య ఆదేశించారు. ధర్మసాగర్ రిజర్వాయర్‌లో సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని దీంతో తాగునీటికి ఢోకా లేదని అధికారులు చెబుతున్నారు.
వరంగల్, ఏప్రిల్ 9 : నగరంలో తాగునీటి ఎద్దడి నివారణకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. వేసవి కాలంలో తాగునీటి సరఫరాకు పక్కాగా ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటా నల్లా కనెక్షన్లు ఇచ్చి నీటిని సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. నగర ప్రజలకు సరిపడా నీటి నిల్వలు ధర్మసాగర్ రిజర్వాయర్‌లో నిండుగా ఉన్నాయి. వాటిని సక్రమంగా సరఫరా చేసేందుకు గ్రేటర్ అధికారులు సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. పైపులైన్ లీకేజీలు, బోర్ల మరమ్మతులు చేయడంతో పాటు అద్దె ట్యాంకర్లు, పాతకాలం నాటి వాల్వ్‌ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయనున్నారు. యుద్ధప్రాతిదికన పనులు చేపట్టాలని కమిషనర్ ప్రావీణ్య ఆదేశాలు జారీ చేశారు. నీటి సరఫరా విభాగం సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.
లీకేజీలే ప్రధాన సమస్య..
తాగునీటి సరఫరాలో సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోనున్నారు. లీకేజీలు నగర తాగునీటి సరఫరాలో ప్రధాన సమస్యగా మారుతున్నాయి. దీంతో అధికారులు లీకేజీల మరమ్మతులపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో 66 లీకేజీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటితో పాటు కొన్ని మిషన్ భగీరథ పైపులైన్లు పగిలి లీకేజీలు అవుతున్నాయి. వీటితో పాటు నగరంలోని చేతిపంపుల మరమ్మతులు చేయనున్నారు. మురికివాడల్లో ఎంతో ఉపయోగంగా ఉండే స్టాటిక్ ట్యాంకుల వద్ద ఉన్న బోర్ల మరమ్మతులు చేయాలని కమిషనర్ ఆదేశించారు. అలాగే, తాగునీటి సరఫరా కోసం అద్దె ట్యాంకర్లను వినియోగించడంతోపాటు పాతకాలం నాటి వాల్వ్‌లను తొలగించి కొత్త వాటిని అమర్చనున్నారు.
మరమ్మతుకు రూ.38 లక్షలు..
సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా రూ.1.50 కోట్లతో జీడబ్ల్యూఎంసీ అత్యవసర పనులు చేపట్టింది. గ్రేటర్ పరిధిలోని లీకేజీల మరమ్మతుల కోసం రూ.38 లక్షలతో అంచనాలు సిద్ధం చేసింది. వేసవిలో తాగునీటి సరఫరా కోసం 21 అద్దె ట్యాంకర్ల నిర్వహణకు రూ.21 లక్షలు, నగరంలో నిరుపయోగంగా ఉన్న 345 బోర్‌వెల్స్ మరమ్మతుల కోసం రూ. 20 లక్షలు, చేతి పంపుల మరమ్మతుల కోసం రూ.16 లక్షలు, తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా కొత్త వాల్వ్‌ల ఏర్పాటు కోసం రూ. 11 లక్షలు, స్టాటిక్ ట్యాంకుల వద్ద బోర్ల మరమ్మతు కోసం రూ.23 లక్షలతో ప్రతిపాదనలు రూపొందించారు.