సుబేదారి, జనవరి 27 : దేశంలో ఉన్న దళితులంటే బీజేపీకి గిట్టదు.. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఎనిమిదేళ్లు గడుస్తున్నా దళితుల సంక్షేమ కోసం ఒక్క సంక్షేమ పథకమైనా ప్రవేశపెట్టారా.. కనీసం వారి గురించి ఏనాడైనా ఆలోచించారా అని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. దళితులపై ఏమాత్రం ప్రేమ ఉన్నా దేశవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేసి చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు. లేకపోతే దేశంలోని దళిత సమాజం వచ్చే ఎన్నికల్లో బీజేపీని బొంద పెట్టుడు ఖాయమని హెచ్చరించారు. గురువారం హనుమకొండ ఎక్సైజ్‌కాలనీలోని ఆయన నివాసంలో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్, చిల్పూరు, స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్, లింగాలఘనపురం మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దళితులకు ఉద్యోగాలు కల్పించకపోగా, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ వాటిలో పనిచేస్తున్న దళితులను రోడ్డుపాలు చేసిందని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఆ పార్టీ నాయకులు దళితులపై దాడులు చేస్తున్నా కేంద్రంలోని పెద్దలు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా వారిపై ప్రేమ ఉంటే దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ ఏటా తెలంగాణ ప్రజల సంక్షేమ కోసం రూ.50వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. రైతుబంధు, బీమా, ఆసరా, కల్యాణలక్ష్మి, కేసీఆర్‌కిట్, దళితబంధు ఇలా అనేక పథకాలను అమలు చేస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. తెలంగాణలోని దళిత కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళితబంధు అమలు చేస్తున్నట్లు తెలిపారు. 2022-23 సంవత్సరానికి దళితబంధు కోసం రూ.25వేల కోట్లు కేటాయించారని, రెండు లక్షల దళిత కుటుంబాలకు లబ్ధిచేకూరనున్నదని అన్నారు.