నర్సంపేట, మార్చి 10 : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించిన సందర్భంలో యువత కోసం నర్సంపేటలో ఉచి త కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. గురువారం అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రకటనను ప్రస్తావిస్తూ ప్రత్యేకంగా అభినందించారు. ‘తెలంగాణ ప్రభుత్వం 91వేల ఉద్యోగాలను ప్రకటించింది. నిరుద్యోగులకు అన్ని నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండి, అందరికీ ఉపయోగపడేలా కోచింగ్ క్యాంపులు నడపండి. వాటికి కావాల్సిన అన్నింటినీ సమకూర్చండి. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కూడా ఇప్పటికే నర్సంపేటలో నిరుద్యోగుల కోసం కోచింగ్ క్యాంపు నిర్వహిస్తానని, కోచింగ్ సెంటర్‌కు వచ్చే నిరుద్యోగులందరికీ భోజన వసతి కూడా కల్పిస్తానని ప్రకటించారు.’ అంటూ పెద్ది సుదర్శన్‌రెడ్డిని అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాల నియామకాలపై నమ్మకంతో ఎమ్మెల్యే పెద్ది నిరుద్యోగుల కోసం అండగా ఉంటున్నారని చెప్పారు. ఆయన ప్రకటించినట్లుగా మిగతా ఎమ్మెల్యేలు కూడా అన్ని నియోజకవర్గాల్లో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తే మంచిదని సూచించారు. నిరుద్యోగులకు అండగా నిలిచి ఉద్యోగాలు సాధించేలా, రాష్ర్టాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లాలని కోరారు. ఎమ్మెల్యే పెద్ది గతంలోనూ నిరుద్యోగుల కోసం ప్రత్యేక కోచింగ్ క్యాంపులు నిర్వహించారని, భోజన వసతి కూడా కల్పించారని గుర్తు చేశారు.