మహబూబాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ)/తొర్రూరు : తెలంగాణలో యాసంగి ధాన్యం కొనబోమని మరోసారి ఎఫ్‌సీఐ మొండి వైఖరి అవలంబిస్తోందని, దీనిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఏం సమాధానం చెప్తారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. మహబూబాబాద్ ఎంపీ కార్యాలయంలో ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డితో కలిసి శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తొర్రూరులో పాలకుర్తి నియోజకవర్గ స్థాయి సేవాలాల్ జయంతి ఉత్సవాల సభలో మంత్రి పాల్గొన్నారు. ఆయా చోట్ల ఎర్రబెల్లి మాట్లాడుతూ బాయిల్డ్ రైస్ కొనుగోళ్ల విషయంలో కేంద్రం కిరికిరి చూసి పోరాటం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ యాసంగిలో దొడ్డు ధాన్యం పండించవద్దని రైతులను కోరితే కిషన్‌రెడ్డి, బండి సంజయ్ లాంటి వారు రైతులను రెచ్చగొట్టి ‘మీరు పండించండి మేము కొనుగోలు చేస్తం’ అని బీరాలు పలికారని, ఇప్పుడేం సమాధానం చెబుతారని మండిపడ్డారు. రాష్ట్రంలో పుష్కలంగా సాగునీరు ఇస్తూ, 24గంటల కరెంటు ఇస్తూ రైతుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే కేంద్రం మాత్రం తెలంగాణ రైతులపై కక్షగట్టి ఇలా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బాధపడుతున్నారని, బీజేపీ, కాంగ్రెస్ బ్రోకర్ మాటాలను రైతులు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని కోరారు. గిరిజనులు, ఎస్సీ రిజర్వేషన్ల పెంపు, వర్గీకరణ విషయంలో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపినా నాన్చవేత ధోరణి అవలంబిస్తూ ఈ వర్గాలను కేంద్రం మోసం చేస్తున్నదని విమర్శించారు. ఇలాంటి వ్యవహారాలను సహించలేక ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని కేంద్రం తీరుపై మండిపడితే కొందరు మతిలేకుండా అంబేద్కర్‌ను విమర్శించారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్ మాటలు విని రైతులు వరి ఎక్కువగా వేశారని, ఇప్పుడు కేంద్రం వడ్లుకొనబోమని మళ్లీ చెబుతోందని, వరి వేసిన రైతులు ఎటుపోవాలని ప్రశ్నించారు. వరి వేయాలని చెప్పిన బీజేపీ నాయకులను గల్లా పట్టి గుంజి వడ్లు కొనాలని నిలదీయాలని రైతులకు మంత్రి పిలుపునిచ్చారు. వరి వేశాక వడ్లు కొనబోమని అంటే రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. విభజన హామీ చట్టం ప్రకారం ఒక్కటి కూడా కేంద్రం అమలు చేయలేదని విమర్శించారు. రైతుల మోటర్లకు మీటర్లు పెట్టలేదని బీజేపీ నాయకులు చెబుతున్నారని, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో రైతుల మోటర్లకు మీటర్లు పెట్టిన విషయాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి స్వయంగా వెళ్లి పరిశీలించి చూపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.