కొందరంతే.. ఎప్పుడూ సాహసాలే చేస్తుంటారు. సంచనాలు సృష్టిస్తుంటారు. సినిమాలతోపాటు నిజజీవిత సంఘటనలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. అలాంటి వారిలో ప్రముఖంగా వినిపించే పేరు.. నీనా గుప్తా. 80వ దశకంలో ఆమె చేసిన ఘనకార్యాలు ఎన్నెన్నో! ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకొన్నది. అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్గా పేరుతెచ్చుకున్నది. ఓవైపు అగ్ర హీరోలతో జోడీ కడుతూనే.. విండీస్ దిగ్గజ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌తో ప్రేమాయణం సాగించింది. పెళ్లి కాకుండానే తల్లి కావాలని నిర్ణయించుకున్నది.
రిచర్డ్స్‌తో కలిసి ఓ బిడ్డను కూడా కన్నది. ఈ క్రమంలో కుటుంబంతోపాటు సమాజం నుంచీ అనేక విమర్శలు ఎదుర్కొన్నది. అయితే, అన్నిటినీ తట్టుకుంటూ ధైర్యంగా నిలబడింది. వ్యక్తిగత జీవితంతోపాటు వృత్తిజీవితంలోనూ ఉన్నత స్థాయికి ఎదిగింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన గతాన్ని ఓసారి గుర్తుచేసుకున్నది. రిచర్డ్స్‌తో ప్రేమ వ్యవహారం, బిడ్డను కనాలనే నిర్ణయం, మసాబా పెంకపం.. ఇలా చాలా విషయాలను పంచుకున్నది. తన జీవితంలోని ముఖ్య సంఘటనలను వివరిస్తూ.. “బిడ్డను కనాలన్న నిర్ణయం పూర్తిగా నాదే! అప్పుడు వీవీఎన్ను అడిగా! దానికి అతను సంతోషంగా ఒప్పుకొన్నాడు. మసాబా తన కూతురేనని బహిరంగంగా అంగీకరించడంలో వీవీఎన్కు ఎటువంటి సంకోచం లేదు.
ఆమెను పెంచడం నాకు చాలా గర్వంగా ఉండేది” అంటూ చెప్పుకొచ్చింది. ఇక తనకు ఆర్థిక స్వాతంత్య్రం చాలా ముఖ్యమని చెబుతూ.. రిచర్డ్స్ మద్దతు ఉన్నప్పటికీ, మసాబా కోసం అతని నుంచి ఆర్థిక సాయం ఆశించలేదని వెల్లడించింది. తానెప్పుడూ ఎవరి దగ్గరా చేయి చాచేదాన్ని కాదని చెప్పుకొచ్చింది. తన తల్లిదండ్రులను కూడా ఎప్పుడూ డబ్బులు అడిగేదాన్ని కాననీ, వారు ఏదిస్తే దాన్నే తీసుకునేదాన్నని తెలిపింది. ఇక నటనను కొనసాగించాలనే తన నిర్ణయాన్నీ తన తల్లిదండ్రులు వ్యతిరేకించేవారనీ, ఆ వృత్తి పట్ల వారికి ఎన్నో సందేహాలు ఉండేవని నీనా వెల్లడించింది.
“నటన అనేది గౌరవనీయమైన ఉద్యోగం కాదని వారు భావించేవారు. నాకు మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఏదో సాధించాలని ఉండేది. అందుకే, వారి ఇష్టానికి వ్యతిరేకంగానే ముంబైలో అడుగుపెట్టాను” అంటూ నాటి సంగతులను గుర్తుచేసుకున్నది. ఒంటరి తల్లిగా పిల్లలను పెంచడం వల్ల ఎదురయ్యే సవాళ్ల గురించి కూడా నీనా చెప్పుకొచ్చింది. “ఒంటరిగా పిల్లల్ని పెంచడం అంత తేలికైన విషయం కాదు. భావోద్వేగంగా, ఆచరణాత్మకంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది” అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నది.