కామారెడ్డి, ఫిబ్రవరి 21: కాంగ్రెస్, బీజేపీ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో కామారెడ్డిలో శనివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. డిగ్రీ కళాశాల ఆస్తుల విషయంలో ఇరువురి మధ్య మొదలైన ఆరోపణలు, ప్రత్యారోపణలు చివరకు బాహాబాహీకి దారి తీశాయి. కాలేజీ ఆస్తుల విషయంలో తనపై కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలకు ఆధారాలతో శిశుమందిర్ పాఠశాలలో చర్చకు రావాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సవాల్ చేయగా, అధికార పార్టీ నేతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. ఎమ్మెల్యే కాటిపల్లిని గృహ నిర్బంధం చేయడంతో పాటు శిశుమందిర్ వైపు వచ్చిన ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు సందీప్ సహా పలువురు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, పోసానిపేట్ మాజీ సర్పంచ్ మహేందర్‌రెడ్డి తన కారుతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి దూసుకెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ కార్యకర్తలు కారును ధ్వంసం చేశారు. పోలీసులు మహేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు.
రాజీనామాకు సిద్ధమన్న కాటిపల్లి..
తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని ఎమ్మెల్యే కాటిపల్లి ప్రకటించారు. తన నివాసం వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అనేక అక్రమాలకు పాల్పడ్డారని, దీనిపై సీఎంకు ఫిర్యాదు చేశానని తెలిపారు. తమ కుటుంబ నిజాయితీ నిరూపించుకునే దాకా ఊరుకోనన్నారు. ఇది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని చెప్పారు. తనను అడ్డుకుంటామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, ఎవరు అడ్డుకుంటారో చూస్తానని సవాల్ చేశారు. భూముల విషయమై సోమవారం కలెక్టర్ ఎదుట తేల్చుకుందామన్నారు.
‘వెనుకడుగు వేసిన ఎమ్మెల్యే’
సవాల్ విసిరిన ఎమ్మెల్యే కాటిపల్లి చర్చకు రాకుండా వెనుకడుగు వేశారని ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు సందీప్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. డిగ్రీ కాలేజీ భూముల కమిటీలో ఎమ్మెల్యే సభ్యుడిగా ఎలా అయ్యారో సమాధానం చెప్పాలన్నారు. మీ మిత్రుడైన అరోరా రమేశ్ ఎక్కడి వాడని, కమిటీలో ఎలా చోటు దక్కిందో చెప్పాలన్నారు. కాలేజీ ఆస్తుల పత్రాలను బ్యాంకులో పెట్టి రూ.6 కోట్ల అప్పు తీసుకున్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. తాము ఆధారాలతో సహా చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
పోలీసుల వైఫల్యం..
ఉద్రిక్తతలు నివారించడంలో పోలీసులు విఫలమమ్యారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భారీగా బలగాలు మోహరించి ఉన్నా.. మహేందర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలోకి దూసుకెళ్లడం, బీజేపీ శ్రేణులు అతడి కారును ధ్వంసం చేస్తున్నా అక్కడే ఉన్న పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై చర్యలు తప్పవని ఎస్పీ రాజేశ్చంద్ర హెచ్చరించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి దూసుకెళ్లిన మహేందర్‌రెడ్డిని అరెస్టు చేశామని చెప్పారు.