గద్వాల, ఫిబ్రవరి 21 : యాసంగి సీజన్ ముగిసినా ఇప్పటి వరకు రైతు భరోసాపై ప్రభుత్వం భరోసా ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట పెట్టుబడి సాయం విడుదల చేస్తే యాసంగిలో సాగు కోసం చేసిన అప్పులు తీర్చుకుందామనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. రేవంత్ సర్కారు నిధులు విడుదల చేయకపోవడంతో ఆసాముల వద్ద తెచ్చిన అప్పులకు వడ్డీ పెరగడం.. వాటిని తీర్చలేక సతమతం అవుతున్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి తన అనుకూల మీడియా.. ఛానళ్ల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు త్వరలో రైతుభరోసా అందిస్తాం.. అందుకోసం నిధులు సమీకరణ చేశారంటూ రైతులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నది. బక్క చిక్కిన రైతు ప్రభుత్వం మాటలు నమ్మి సాయం కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.
అయినా రైతుల కళ్లు చెమ్మగిల్లడమే తప్పా.. రైతు భరోసా మాత్రం ప్రభుత్వం విడుదల చేయడం లేదు. యాసంగి సీజన్‌కు సంబంధించి ఈనెల 17న రైతు భరోసా ప్రభుత్వం విడుదల చేస్తుందని ప్రభుత్వానికి అనుబంధంగా ఉంటే మీడియా ద్వారా ముఖ్యమంత్రి చెప్పించి మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు దండుకునే ప్రయత్నం చేశారు. కానీ 21వ తేదీ దాటినా ఊసెత్తకపోవడంతో రైతులు ఆయోమయంలో పడ్డారు. వానకాలం రైతులకు కలిసిరాక పోగా కన్నీళ్లు మిగిల్చింది. దీంతో యాసంగిలోనైనా పంటలు సాగు చేసి అప్పుల ఊబి నుంచి బయట పడదామన్నా రైతన్నకు ప్రభుత్వం చేయూత దక్కకపోగా ఇబ్బందులు పడుతున్నారు. యాసంగి సీజన్ ముగిసి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు రైతులకు సర్కారు ఎలాంటి భరోసా ఇవ్వడం లేదు. దీంతో చేసిన అప్పు ఎలా తీర్చాలో అని అన్నదాతలు మదనపడుతున్నారు. రైతులు హస్తం గుర్తు ను నమ్మి ఓటేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత రిక్తహస్తం చూయిస్తుందని కలలో కూడా అనుకోలేదని వాపోతున్నారు.
గత కేసీఆర్ ప్ర భుత్వంలో వానకాలం, యా సంగి సీజన్లు ప్రారంభం కాగానే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం నేరుగా రైతుల ఖాతాల్లో జమయ్యే ది. సంబంధిత కర్షకుల మో బైల్స్‌కు టంగ్.. టంగ్ మం టూ మెసేజ్‌లో వచ్చేవి. దీంతో సంతోషంతో రైతులు సాగు పనులు చేసుకోనేటోళ్లు.. కానీ ప్రస్తుత ప్రభుత్వం యాసంగి సీజన్ ముగిసినా రైతుభరోసాపై ఎటువంటి నిర్ణయం తీసుకోక పోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఓవైపు రైతుభరోసా ఇవ్వకుండా.. మరోవైపు అవసరమైన ఎరువులు ఇవ్వకుండా రైతులను నట్టేట ముంచుతోంది. ప్రభుత్వం విఫలం కావడంతో చిన్న, సన్నకారు రైతులు ఇటు వ్యవసాయ కూలీలకు డబ్బులు చెల్లించడంతోపాటు ఎరువులకు డబ్బులు ఖర్చు అవుతుండడం.. చేసి అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో డిసెంబర్ చివరి నాటికే..
రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నాటి కేసీఆర్ ప్రభుత్వం యాసంగి సీజన్ ప్రారంభం మొదలు రైతుబంధు సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేసేది. గత సర్కారు పంపిణీ చేసిన వివరాలను పరిశీలిస్తే 2021లో జూన్ 21న, 2022లో జూన్ 29న, 2023లో జూన్ 27వ తేదీన నగదు జమ చేసింది. 2023లో పూర్తి స్థాయిలో ఎన్నికల కోడ్ సందర్భంగా నాటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేదు. మిగిలిపోయిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు విడుదల చేసింది. ఓ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం రైతు భరోసా రైతులకు ఇవ్వలేదు. 2025-2026 వానకాలం సీజన్‌కు సంబంధించి 1,69,299 మంది రైతులకు రూ.268 కోట్ల 84 లక్షలు చెల్లించింది. యాసంగి సీజన్‌కు సంబంధించి 1.95 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేశారు. వీరందరికీ రైతు భరోసా చెల్లించాల్సి ఉంది. ఇప్పటికైనా రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని త్వరగా పెట్టుబడి సాయం అందించాలని పలువురు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
యాసంగి సీజన్ ముగిసినా..
యాసంగి సీజన్ ముగిసినా ప్రభుత్వం రైతు భరోసా కింద అందించాల్సిన పెట్టుబడి సాయం ఇవ్వకపోవడంతో రైతులు ఆరిగోస పడుతున్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి షరతులు లేకుండా రైతు భరోసా ఇవ్వడంతోపాటు కౌలు రైతులకు అందిస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు..
నేడు అధికారంలోకి వచ్చాక ఆ ఊసే
ఎత్తడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెంచి ఇస్తామన్న రైతు భరోసా ఇవ్వకుండా.. పాత రైతుబంధు మాత్రమే ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకొన్నది. పెట్టుబడి సాయం ఇవ్వడంలో కాలయాపన చేస్తుండడంపై రైతు ల్లో అసహనం పెరుగుతోంది. అసలు రైతు భరోసా ఇస్తారో? ఇవ్వరో? అన్న ఆందోళనలో కొట్టు మిట్టాడుతున్నారు. అయినా నేటికీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు.
భరోసా ఇవ్వక.. అవస్థలు
ప్రభుత్వం యాసంగికి సంబంధించి రైతు భరోసా ఇవ్వకపోడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. యాసంగిలో పంట పెట్టుబడి కోసం అప్పులు చేశాం. ప్రస్తుతం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక సతమతమతున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీజన్ ప్రారంభం కాగానే రైతుబంధు రైతుల ఖాతాల్లో జమచేసే వారు. పంటలు సాగు చేసే రైతులకు ఎంతగానో ఉపయోగపడేది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసా రాక, ఎరువులు సక్రమంగా అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతు భరోసా సాయం అందించి ఆదుకోవాలి.
– వీరేశ్ గౌడ్, రైతు, తాటికుంట
రైతులపై కక్ష సాధింపు ఎందుకు?
రైతులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. సీజన్ ముగిసినా ఇప్పటి వరకు రైతు భరోసా వేయలేదు. యాసంగి సీజన్లో పెట్టుబడి సాయం, ఎరువుల కోసం ఆసాములు వద్ద అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. పంట పెట్టుబడికి సాయం తెచ్చుకున్నాం. అది ప్రస్తుతం తీర్చాలని వాళ్లు అడుగుతున్నారు. ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకపాయే.. ఆసాములకు అప్పులు ఎలా చెల్లించాలో తెలియడం లేదు. గత కేసీఆర్ హయాంలో రెండు సీజన్లు ప్రారంభం కాగానే రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేది. అవి పంట పెట్టుబడికి ఎంతో ఉపయోగ పడేవి.
– మహేశ్, రైతు, కొత్తపల్లి, జోగుళాంబ గద్వాల