ఈ ట్రెండ్ ఫాలో అయ్యేవారు చెప్పేది ఒక్కటే ‘జ్ఞానం దుఃఖాన్ని ఇస్తుంది, అజ్ఞానం ఆనందాన్ని ఇస్తుంది (Ignorance is Bliss). తెలివి పెరిగే కొద్దీ ఆందోళన పెరుగుతుందని సైన్స్ చెబుతుంది. అందుకోసం కావాలనే తమ ‘ఐక్యూ’ (IQ)ని తగ్గించుకుని ఆలోచించడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఈ Retardmaxxing ఒక తాత్కాలిక విశ్రాంతి మాత్రమే కావాలి కానీ.. జీవితాంతం బాధ్యతారాహిత్యంగా ఉండటానికి సాకుగా మారకూడదు. తెలివిని ఉపయోగించాల్సిన చోట ఉపయోగిస్తూనే, అనవసరమైన చోట దాన్ని స్విచ్ ఆఫ్ చేయడమే అసలైన బ్యాలెన్స్.
పొద్దున్న లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు మన మెదడు రెస్ట్ లేని మెషిన్లా పనిచేస్తున్నది. రేపు ఏం జరుగుతుంది? నా కెరీర్ ఏంటి? ఆ వ్యక్తి నన్ను చూసి ఎందుకు నవ్వాడు? ఇలా ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో పెట్టి చూస్తూ ‘ఓవర్‌థింకింగ్’ అనే ఉచ్చులో చిక్కుకుపోతున్నాం. ఈ మానసిక ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి నెటిజన్లు ఇప్పుడు ఒక వింతైన ట్రెండ్‌ను తెరపైకి తెచ్చారు. అదే ‘Retardmaxxing’. ఈ పేరు వినడానికి కొంచెం వింతగా అనిపించినా దీని వెనుక ఉన్న అసలు ఫిలాసఫీ ఏంటో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు.
అసలేమిటీ ‘Retardmaxxing’? ఈ పదం ‘Retard’ (మందబుద్ధి)’, ‘Maxxing (అతిగా చేయడం)’ అనే పదాల నుంచి పుట్టింది. కాసేపు అన్నిటినీ ఇగ్నోర్ చేసే ఓ తరహా ఎక్సర్సైజు లాంటిది ఇది. ఎవరినీ కించపరచకపోవడం ఈ ట్రెండ్ ఫాలో అయ్యేవారి ఉద్దేశం. మనం ప్రతి విషయంలోనూ చాలా తెలివిగా, పర్ఫెక్ట్గా ఉండాలి అని ప్రయత్నిస్తూ ఒత్తిడికి గురవుతున్నాం. కానీ ‘కొంతసేపు అసలు ఏమీ తెలియని వ్యక్తిలా ఉండండి. మెదడుకు అస్సలు పని పెట్టకండి. తెలివి తేటలను పక్కన పెట్టి చిన్న పిల్లలలాగా ఆలోచించండి’ అని ఈ ట్రెండ్ చెబుతుంది.
బ్రెయిన్ రోటింగ్: అతిగా ఆలోచించడం వల్ల తలనొప్పి రావడం తప్ప ప్రయోజనం ఉండదు. అలా కాకుండా మనల్ని నవ్వించే వీడియోలు చూస్తూ కాసేపు గడపండి. ఎలాంటి లోతైన చర్చలు చేయకుండా సరదాగా కాలక్షేపం చేయడం వల్ల మానసిక ప్రశాంతత దక్కుతుందని ఈ ట్రెండ్ ఫాలో అయ్యే వారు భావిస్తున్నారు.
నేటి డిజిటల్ ప్రపంచంలో సమాచార విస్ఫోటనం వల్ల యువత మానసికంగా అలసిపోతున్నారు. ఒకప్పుడు ఒక వస్తువు కొనాలన్నా, ఒక నిర్ణయం తీసుకోవాలన్నా కొన్ని ఆప్షన్లు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ ఓవర్‌లోడ్ కారణంగా ప్రతి చిన్న విషయానికి వందల కొద్ది రివ్యూలు, వీడియోలు మన కళ్లముందు కనిపిస్తున్నాయి. దీంతో మెదడు ‘డెసిషన్ ఫెటీగ్’కి గురవుతున్నది. ఈ అనంతమైన ఆప్షన్ల నుంచి తప్పించుకుని..‘అసలు నాకు ఏమీ తెలియదు, ఏది జరిగితే అది జరగనివ్వు’ అని వదిలేయడమే Retardmaxxing. దీనిని ఒక రకమైన ‘డిఫెన్స్ మెకానిజం’ అని చెప్పుకోవచ్చు.
నిర్ణయాల భయం: ప్రతి చిన్న నిర్ణయం వెనుక లాజిక్ వెతకడం వల్ల మనశ్శాంతి కరువవుతుంది. దానికి విరుగుడుగా ‘మూర్ఖంగా’ లేదా ‘అమాయకంగా’ ఉండటమే మేలని చాలామంది భావిస్తున్నారు.
సోషల్ మీడియా ఒత్తిడి: ఇన్‌స్టాగ్రామ్‌లో అందరూ తెలివైన వారుగా, సక్సెస్ ఫుల్ పీపుల్ లాగా కనిపిస్తుంటే ‘నేను ఎందుకు అలా లేను?’ అనే ఓవర్‌థింకింగ్ మొదలవుతుంది. ఈ ట్రెండ్ ఆ ‘పర్ఫెక్షన్’ ముసుగును తొలగిస్తుంది.
ఇంటెలెక్చువల్ విరక్తి: నేటి తరం ప్రతి దాన్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నది. ఒక జోక్ విన్నా అందులో లాజిక్ వెతకడం, ఒక సినిమా చూసినా అందులో పొలిటికల్ కరెక్ట్‌నెస్ వెతకడం.. ఇలా ప్రతి దాన్ని విశ్లేషించడం వల్ల సహజమైన ఆనందం మాయమవుతున్నది.
సామాజిక తిరుగుబాటు: ప్రస్తుతం సమాజంలో ‘నువ్వు ఎప్పుడూ ప్రొడక్టివ్‌గా ఉండాలి, ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలి’ అనే ఒత్తిడితో కూడిన పోటీ నడుస్తున్నది. దీనికి వ్యతిరేకంగా వచ్చే ట్రెండే ఇది. ‘నేను ఏమీ నేర్చుకోను, నేను ఏమీ సాధించను, కాసేపు హాయిగా ఇలాగే పడి ఉంటాను’ అని చెప్పడం ఒక రకమైన నిరసన. ఇది జపాన్ లోని ‘హికికోమోరి’, చైనాలోని ‘లయింగ్ ఫ్లాట్’ ఉద్యమాలకు ఒక డిజిటల్ వెర్షన్ లాంటిది.
ప్రత్యామ్నాయం: ధ్యానం చేసేటప్పుడు ఏమీ ఆలోచించవద్దు అని మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటాం. కానీ, అది అందరికీ సాధ్యం కాదు. Retardmaxxing అనేది ఒక రకమైన ‘నెగటివ్ మెడిటేషన్’. ఇక్కడ మనం ఆలోచనలను ఆపం, కానీ ఆ వచ్చే ఆలోచనలకు విలువ ఇవ్వం అంతే!
నిపుణుల మాట ఈ పదం వాడకం పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఆ ఆలోచన వెనుక ఉన్న ‘మైండ్‌ఫుల్‌నెస్’ని పలువురు నిపుణులు మెచ్చుకుంటున్నారు. మెదడును నిరంతరం ఒత్తిడికి గురి చేయడం కంటే, దానిని స్విచ్ ఆఫ్ చేయడం మంచిదే అని సెలవిస్తున్నారు. అయితే, ఇది కేవలం పలాయనవాదంలా మారకుండా చూసుకోవాలని చెబుతున్నారు. అతిగా ఆలోచించి ఆరోగ్యం పాడుచేసుకోవడం కంటే, కాసేపు లోకాన్ని మర్చిపోయి అమాయకంగా ఉండటం తప్పు లేదని సలహా ఇస్తున్నారు. నిజమే కదా.. మనల్ని మనం అతిగా విశ్లేషించుకుంటూ బాధపడే కంటే కాసేపు ఆ తెలివితేటలను పక్కన పెట్టి హాయిగా ఉండటం గొప్ప విషయమే కదా!