హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 11 : హనుమకొండ, వరంగల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం క్రాస్‌కంట్రీ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీలను తెలంగాణ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ, ములుగు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి పాగడాల వెంకటేశ్వర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అండర్-16, 18, 20 బాయ్స్ అండ్ గర్ల్స్‌తో పాటు మెన్ అండ్ ఉమెన్ నాలుగు విభాగాల్లో పోటీలు నిర్వహించగా సుమారు 150 మంది వరకు అథ్లెట్లు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. ప్రతి విభాగం నుంచి ఆరుగురు చొప్పున అథ్లెట్లను ఎంపిక చేసినట్లు, ఎంపికైనవారు ఈనెల 18న మహబూబాబాద్ జిల్లాలో జరిగే తెలంగాణ స్టేట్ క్రాస్‌కంట్రీ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా సెక్రటరీ యుగేంధర్‌రెడ్డి, హనుమకొండ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రజినీకాంత్, సాంబమూర్తి, కృష్ణమూర్తి, మహేందర్, కోచ్‌లు శ్రీమన్నారాయణ, నాగరాజు, అశ్విని తదితరులు పాల్గొన్నారు.