రాయపర్తి, డిసెంబర్ 11: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకేంద్రంలో ఈ నెల 14న నిర్వహించ తలపెట్టిన అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్) రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్ర సూరి కోరారు. ఆదివారం జనరల్ కౌన్సిల్ సమావేశాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను మండలకేంద్రంలో సంఘం ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబించడం వల్ల దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశాలకు మండలంలోని రైతులు, రైతు కూలీలు, ప్రజాస్వామిక వాదులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం వరంగల్ డివిజన్ అధ్యక్షుడు మైదం పాణి, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు పసునూరి రాజు, ఉడుతల సూరయ్య, ఉసిల్ల రాజయ్య, బూస మొగిలి, సాబిరీకాని మోహన్, సింగం కిశోర్ పాల్గొన్నారు.