హనుమకొండ, డిసెంబర్ 11 : మనో సంకల్పం ఉంటే వైకల్యం అడ్డురాదని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఆదివారం హనుమకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో నిర్వహించిన ప్రపంచ మానసిక దివ్యాంగుల వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మధుసూదనాచారి మాట్లాడుతూ మల్లికాంబ మనోవికాస కేంద్రం వ్యవస్థాపకురాలు బండా రామలీల మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో మానసిక దివ్యాంగులకు సేవ చేయడం అభినందనీయమన్నారు. మానసిక దివ్యాంగులు మనో ధైర్యంతో ముందుకు సాగాలన్నారు. వీరికి తన వంతు సాయంగా ఎమ్మెల్సీ నిధుల నుంచి రూ.5 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పిల్లలు విచిత్ర వేషధారణలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. అనంతరం చిన్నారులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు బండా రామలీల, బండ సదానందం, కోడం కల్యాణ్, సాంబశివరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.