గిర్మాజీపేట, డిసెంబర్ 5: ఇటీవల ఆర్థిక సమస్యలతో స్వర్ణకారుడు ఉప్పుల సతీశ్-స్రవంతి దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో అనా థలైన ఇద్దరు చిన్నారులకు కుటుంబసభ్యుల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృసంఘం ప్రధాన కార్యదర్శి చొల్లేటి కృష్ణమాచార్యులు సంఘ సభ్యులతో కలిసి రూ. 25 వేల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ శాసనసబాధిపతి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అందించిన రూ. 25 వేలకు సంఘ సభ్యులు అందరూ కలిసి జమ చేసిన మరో రూ. 25 వేలు కలిపి మొత్తం రూ. 50 వేలను చిన్నారులైన ఉప్పుల మలన్విరాట్, ఉప్పుల మలన్ విహాన్ పేర ఒక్కొక్కరికీ రూ. 25 వేల చొప్పున సెంట్రల్బ్యాంక్లో ఫిక్స్ చేశామన్నారు. చిన్నారులకు వచ్చే విద్యా సంవత్సరం(2023-24) చదవులకయ్యే ఖర్చులను శ్రీరామోజు నాగరాజు, 2024-25 విద్యా సంవత్సరానికి అయ్యే ఖర్చులను హైకోర్టు న్యాయవాది నంచ ర్ల మురళి భరిస్తానని హామీ ఇచ్చారన్నారు. రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృసంఘం ఉపాధ్యక్షుడు వీణవంక సదానందం, హన్మ కొండ జిల్లా అధ్యక్షుడు అలుగోజు కృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడు జగన్, ప్రధాన కార్యదర్శి నాగసోమేశ్వరాచారి తదితరులున్నారు.