గిర్మాజీపేట, డిసెంబర్ 5 : నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తున్నదని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. సోమవారం శివనగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని 39 మంది లబ్ధిదారులకు రూ.25లక్షల 17వేల 500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ దవాఖానల్లో వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేని ఎంతో మందికి సీఎం రిలీఫ్ ఫండ్ వరంలా మారిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం వర్తించని ఆనేక రోగాలకు సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్వోసీ ద్వారా వైద్యం చేయించుకోవచ్చని తెలిపారు. తెల్లరేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని వివరించారు.
రాజకీయాలకు అతీతంగా పైసా లంచం ఇవ్వకుండా నిరుపేదలు లబ్ధి పొందుతున్నారన్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సీఎం సహాయ నిధికి ఐప్లె చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థికసాయం అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సురేశ్‌జోషి, గందె కల్పన, ఆకుతోట తేజస్వి, పల్లం పద్మ, గుండేటి నరేంద్రకుమార్, పీఏసీఎస్ చైర్మన్ విజయ్‌భాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు నీలం రాజ్‌కుమార్, మాజీ కార్పొరేటర్ కుందారపు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.