నర్సంపేట, నవంబర్ 30 : వైఎస్ షర్మిల వెనుక బీజేపీ, కాంగ్రెస్ కుట్రల బాణం దాగి ఉందని, ఆమెను అడ్డుకున్న క్షణాల్లోనే బీజేపీ నాయకులు, గవర్నర్ మద్దతు తెలిపిన తీరుతో తెలుస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. షర్మిలకు మద్దతుగా కిషన్‌రెడ్డి, బండి సంజయ్, కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి మాట్లాడారని వివరించారు. గవర్నర్ కూడా స్పందించిన తీరును చూస్తే షర్మిల పాదయాత్రలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలపై దుర్భాషలాడుతూ, విద్వేషాలు రెచ్చగొట్టడంలో కుట్రలు దాగి ఉన్నాయని అన్నారు. అరెస్టు చేసిన క్షణంలోనే మాట్లాడడాన్ని బట్టి ఆమెకు మద్దతు ఇస్తున్న నాయకుల తీరు బయటపడిందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ను షర్మిల దుర్భాషలాడిన తీరు గవర్నర్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
ఆ విషయంపై ఎందుకు స్పందించలేదని అన్నారు. ముమ్మాటికీ ఈ బాణం వెనుక కేంద్రాన్ని నడిపే బీజేపీ ఉందని తెలిపారు. వైఎస్ షర్మిల తెలంగాణ ప్రాంతంలో పాదయాత్ర చేస్తూ విద్వేషాలు సృష్టిస్తున్నారని అన్నారు. తాను రూ. వేల కోట్లు కూడబెట్టానని ఆరోపణలు చేశావు. ఏనాడు కూడా ప్రత్యర్థి పార్టీల నాయకులు తనపై ఆరోపణలు చేయలేదని అన్నారు. తనకు ఆస్తులు ఎక్కడున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ట్రాక్టర్ డ్రైవర్‌గా, రైతుగా పనిచేశానని మాట్లాడి రైతులను కించపరచడం తగదని అన్నారు. మీకు ఉన్న ఆస్తులను బయటపెడతా, అవన్నీ ప్రజలకు పంచడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. వేల ఎకరాల భూములు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే సంపాదించారని అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నవాబుపేటలో వందల ఎకరాల భూమి బ్రదర్ అనిల్‌కుమార్, బినామీల పేర్లతో సంపాదించారని చెప్పారు.
సంగారెడ్డి పూడూరులోనూ వందల ఎకరాల భూములు ఉన్నాయని, జిల్లాకో వంద ఎకరాల భూములు సంపాదించుకున్నారని అన్నారు.అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. వాటిలో ఎర్రమట్టి వ్యాపారం చేసుకుంటున్నారని తెలిపారు. బయ్యారం గనులను ఆక్రమించి అక్కడ వ్యాపారం చేస్తుంటే తానే ఉద్యమకారులతో అడ్డుకున్నానని ఎమ్మెల్యే పెద్ది గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏ సమస్యలు లేవా అని ప్రశ్నించారు. అక్కడికి వెళ్లి తాము సమస్యలపై పోరాడుతామని, అన్ని ప్రాంతాలు తిరిగి చెబుతామని వివరించారు. తాము కోర్టులను గౌరవిస్తున్నామని, స్వేచ్ఛగా, శాంతియుతంగా ఎవరైనా పాదయాత్ర చేసుకునే హక్కు ఉందన్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. విద్వేషాలు సృష్టిస్తే ఇక్కడి ప్రజలు ఊరుకునే ప్రశ్నలేదని హెచ్చరించారు. ఒక మహిళ అని ఓపిక పడుతుంటే విచ్చల విడిగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
గోదావరి జలాలను తీసుకొచ్చేందుకు తాము ప్రయత్నం చేశామని, ప్రాజెక్టులను కూడా నిర్మించామని అన్నారు. కానీ, ఆ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ లేఖలను అందించారని వివరించారు. దానిపై మీరు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ప్రాజెక్టులను నిలిపివేయడం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని తెలిపారు.ఈ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఇచ్చిన లేఖలను విత్‌డ్రా చేసుకోవాలని ఆంధ్రలో జగన్‌ను ఎందుకు కోరరని నిలదీశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే తెలంగాణ రాష్ట్రం పదేండ్లు వెనుకబడి పోయిందని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని పలుమార్లు నీరుగార్చడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రయత్నించారని అన్నారు. 9 మంది ఎమ్మెల్యేలను కూడా తన పార్టీలోకి తీసుకున్నారని అన్నారు. అలాంటి వారిలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూడా ఉన్న విషయం గుర్తు చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, పార్టీ అధ్యక్షుడు నాగెళ్లి వెంకటనారాయణగౌడ్, ఖానాపురం ఎంపీపీ వేముల ప్రకాశ్‌రావు, టీఆర్ఎస్ నర్సంపేట మండల అధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు బత్తిని శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.