హనుమకొండ, నవంబర్ 6 : మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లు టీఆర్ఎస్ (బీఆర్ఎస్)కు సద్దిమూట కట్టి, భారతీయ జనతా పార్టీకి గోరి కట్టారని పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుతో జిల్లా వ్యాప్తంగా ఆదివారం టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. హనుమకొండ బాలసముద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, సీపీ ఎం, సీపీఐ నాయకులు, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ సంబురాలు చేసుకున్నారు.
పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చీఫ్ విప్ మాట్లాడుతూ.. మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ పక్షాన నిల్చున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. యావత్ దేశం మునుగోడు ఉప ఎన్నిక వైపు చూసిందని చెప్పారు. దీంతో తెలంగాణ ప్రజలు ఎటువైపు ఉన్నారో తేలిపోయిందని, ఈ తీర్పు మతతత్వ బీజేపీకి చెంప పెట్టు అన్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ మళ్లీ గెలిచి, మూడోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ మోడల్‌గా దేశాన్ని తయారు చేసేందుకు దేశ ప్రజలు సీఎం నాయత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు, చట్టాలు తెస్తోందని, నిరుద్యోగ యువతను మోసం చేసిందని ఆయన దుయ్యబట్టారు. దేశ భద్రతకు ముప్పు తెచ్చే విధంగా బీజేపీ తెస్తున్న విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. బీజేపీ నాయకులు అంతా మునుగోడులో ప్రచారం చేసినా ప్రజలు మాత్రం సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకొని టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారన్నారు. ప్రజలు ఇచ్చిన ధైర్యంతో మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామన్నారు. దేశం మొత్తం కేసీఆర్ వైపు చూస్తున్నదని, విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కూడా బీజేపీ అమలు చేయడం లేదని చీఫ్ విప్ ధ్వజమెత్తారు.
మునుగోడు స్ఫూర్తితో ముందుకు సాగుతూ బీజేపీ వ్యతిరేక విధానాలను ఎండగడుతామని స్పష్టం చేశారు. అన్ని వర్గాలను ఏకం చేసి బీజేపీని గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎండగడుతూ ప్రజాధనాన్ని కాపాడుతామని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ కుట్ర లు, కుతంత్రాలు సాగవని పేర్కొన్నారు. కలిసి వచ్చే పార్టీలు, సంఘాలతో బీజేపీపై పోరాటం చేస్తామన్నారు. ధన బలంతో కొనుగోలు చేయాలని చూసిన బీజేపీ ఎత్తుగడలను ఎమ్మెల్యేలు తిప్పికొట్టారని, వారికి ధన్యవాదాలన్నారు. మతతత్వ రాజకీయాలు సృష్టిస్తున్న, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రోత్సహిస్తు న్న బీజేపీని ఎండగట్టి దేశ ప్రజల పక్షాన నిలబడాల ని చీఫ్ విప్ కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన సీపీ ఐ, సీపీఎం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
మునుగోడులో బీజేపీకి తగిన గుణపాఠం
మునుగోడు ఉప ఎన్నిక వచ్చే ఎన్నికలకు నాంది కానున్నాయని టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పేర్కొన్నారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి ఐదు సంవత్సరాలు రాజగోపాల్‌రెడ్డికి అవకాశం ఇస్తే రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయి, ఉప ఎన్నికకు కారకుడయ్యాడని అక్కడి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. బీజే పీ నాయకులంతా మునుగోడులోనే ఉండి ఎన్ని ఎత్తు లు, కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజలు టీఆర్ఎస్ వైపు నిలిచారని, అందుకు అక్కడి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆకు పచ్చ తెలంగాణలో విషం చిమ్ముతూ కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్న బీజేపీకి ప్రజలు తగిన గుణ పాఠం చెప్పారన్నారు. రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ప్రజలను మోసం చేసినందుకు సీపీఎం, సీపీఐ టీఆర్ఎస్కు మద్దతు తెలిపాయన్నారు.
టీఆర్ఎస్ గెలుపునకు కృషి చేసిన, సహకరించిన సీపీఎం, సీపీఐ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కలహాలు స్పృష్టించే బీజేపీకి ఇక్కడ స్థానం లేదని ప్రజలు తీర్పు ఇచ్చారన్నా రు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించిన మునుగోడు ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. అనంత రం పెద్ద సంఖ్యలో వెళ్లి అంబేద్కర్, కాళోజీ విగ్ర హం, అమరవీరులు, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. సమావేశంలో సీపీఎం నాయకులు బొట్ల చక్రపాణి, వాసుదేవరెడ్డి, శ్రీనివాస్, భిక్షపతి, సీపీఐ నాయకులు మేక ల రవి, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.