ఉద్యోగ ప్రకటనతో యువత కసరత్తు మొదలుపెట్టింది. తమ కలను సాకారం చేసుకునేందుకు పుస్తకాలతో కుస్తీ పడుతోంది. రికార్డు స్థాయిలో పోస్టులు భర్తీ కానుండడంతో ప్రిపరేషన్ కోసం ఉద్యోగార్థులు లైబరీల బాటపడుతున్నారు. ప్రశాంత వాతావరణంలో చదువునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో హనుమకొండలోని జిల్లా గ్రంథాలయం యువతతో సందడి నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి చదువుతున్నారు. ఈసారైనా ఉద్యోగం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. గ్రూప్స్‌తో పాటు పోలీస్, వివిధ శాఖల్లో వెయ్యికిపైగా ఖాళీలు ప్రకటించడంతో ఆ దిశగా కృషిచేస్తున్నారు.
– హనుమకొండ చౌరస్తా, మార్చి 10
ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రకటనతో అధికారులు హనుమకొండలోని జిల్లా గ్రంథాలయం సమయాన్ని పెంచారు. నిరుద్యోగుల తాకిడి సైతం ఎక్కువ కావడంతో లైబ్రరీ కళకళలాడుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలను ప్రకటించడంతో జిల్లా గ్రంథాలయ సంస్థ అధికారులు కూడా ఉదయం 5 నుంచి రాత్రి 10 గంటలకు తెరిచి ఉంచనున్నారు. నిరుద్యోగులు సైతం ఉదయమే లైబ్రరీకి చేరుకుని పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. కావాల్సిన సమాచారాన్ని సెల్ఫోన్లలో సేకరిస్తున్నారు. టిఫిన్ బాక్సులు తెచ్చుకొని మధ్యాహ్నం అక్కడే భోజనం చేసి సాయంత్రం వరకు లైబ్రరీలోనే గడుపుతున్నారు. ఉద్యోగ సాధనే ధ్యేయంగా పొద్దుపోయేదాకా గ్రంథాలయంలోనే పుస్తకాల పురుగులుగా మారిపోయారు.