వరంగల్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ దెబ్బకు రేవంత్ సర్కార్ గోదావరిబాట పట్టింది. గోదావరిలో నీళ్లున్నా…రైతుల కండ్లల్లో నీటిపారుదలకు రేవంత్సర్కారే కారణమని శాసనసభలో బీఆర్ఎస్ ఉపనేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహించిన తెల్లారే సీఎం రేవంత్‌రెడ్డి దేవాదుల పర్యటన ఖరారైంది. ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి ములుగు జిల్లా కన్నాయిగూడెంలోని దేవాదుల ప్రాజెక్టును పరిశీలించనున్నారు. దేవాదుల ప్రాజెక్టు విషయంలో రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న నిర్లక్ష్యవైఖరిని మాజీ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించి ఎండగట్టారు.
గురువు కండ్లల్లో ఆనందం కోసమే శిష్యుడైన సీఎం రేవంత్‌రెడ్డి గోదావరి జలాలను ఆంధ్రాకు వదిలిపెడుతున్నారని విమర్శించారు. గోదావరిలో పుష్కలంగా నీరు ఉన్నా తెలంగాణ రైతు పొలాలను ఎండబెట్టి, ఆంధ్రారైతు పొలాలను పండించేలా సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే దేవాదుల ప్రాజెక్టులోని భీంఘనపురంలో 10 పంపులకు నాలుగైదు పంపులైనా నడిపంచడం లేదని, దేవన్నపేట పంప్‌హౌస్‌లో ఉన్న మూడు పంపులను ఆఫ్ చేశారని పేర్నొన్న విషయం తెలిసిందే. మరోవైపు కేసీఆర్ హయాంలో 90 శాతం పూర్తయిన దేవాదుల పనులను తక్షణమే పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ కొలువుదీరినప్పటి నుంచి గోదావరి, కృష్ణానదులపై ఉన్న ప్రాజెక్టులను ఉద్దేశపూర్వకంగానే పండబెట్టారని దుయ్యబట్టారు.
రాష్ట్ర రైతాంగానికి అన్యాయం చేస్తే సహించమని, ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకొని రైతాంగాన్ని ఆదుకోకపోతే ప్రత్యక్ష కార్యాచరణ చేపడుతామని హెచ్చరించారు. కృష్ణా జలాల హక్కుల సాధన కోసం మరో జలసాధన ఉద్యమాన్ని చేపడుతామని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే ప్రకటించడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో రైతాంగం ఆ మేరకు సంసిద్ధం అవుతున్నది. గోదావరి జలాల వినియోగం విషయంలో ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా పోరుబాట పడితే ఆ ప్రభావం రాజకీయ సమీకరణాలపై పడే అవకాశం ఉన్నదని గ్రహించిన కాంగ్రెస్ సర్కార్ తక్షణమే నష్ట నివారణ చర్యలకు దిగినట్టు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మాజీ మంత్రి హరీశ్‌రావు పర్యటించిన తెల్లారే దేవన్నపేటలో పంప్ హౌస్‌లో ఒక పంప్ ఆన్ అయింది. దేవన్నపేట నుంచి పంప్ చేసిన నీళ్లు ధర్మసాగర్ రిజర్వాయర్‌కు చేరుతున్నాయి. హసన్‌పర్తి-ధర్మసాగర్ మండలాల సరిహద్దులోని దేవన్నపేట పంప్‌హౌస్‌ను శుక్రవారం హరీశ్‌రావు పర్యటించిన విషయం తెలిసిందే. దేవన్నపేట పంప్‌హౌస్‌లోని మూడు పంప్‌లకు ఒక పంప్‌ను ఆన్‌చేసి ఆ నీటిని ధర్మసాగర్ రిజర్వాయర్‌లోకి వదులుతున్నారు.
సంవత్సరమేదైనా తమవైఖరి మారదని రేవంత్సర్కార్ మరోసారి నిరూపించింది. గత ఏడాది దేవాదుల భీంఘన్‌పూర్ ఇన్‌టెక్‌వెల్ వద్ద రూ. 8 కోట్ల మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లకు ఇవ్వకపోవడంతో మోటర్లు ఆన్చేయలేదు. ఫలితంగా నీళ్లు అందక వేలాది ఎకరాల పంట నష్టం వాటిల్లింది. రైతుల పరిస్థితిని గ మనించిన బీఆర్ఎస్ అలుపెరుగని పోరాటం చేస్తే నెలన్నర తరువాత ఆ నిధులను విడుదల చేసింది. ఈసారి కూడా సర్కార్‌ది అదే నిర్లక్ష్యం. బీఆర్ఎస్ అడిగితేనో, రైతుల పక్షాన ఏమైందని ప్రశ్నిస్తేనో సర్కార్‌లో కదలిక వచ్చే పరిస్థితి నెలకొన్నదని తాజా పరిణామాలు చెప్తున్నాయి.
శాసనసభలో బీఆర్ఎస్ పక్ష ఉపనేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు దేవన్నపేటలోని పంప్‌హౌస్‌ను పరిశీలించి మోటర్లు ఆన్చేయని దుస్థితిని ఎండగడితేకానీ సర్కార్‌లో చలనం లేకుండాపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. యాసంగి మొదలు కాకముందే ప్రభుత్వం నీటిపారుదల శాఖను అప్రమత్తం చేసి ఏ ప్రాజెక్టు కింద ఎన్ని ఎకరాలు సాగవుతున్నా యి? వాటి నిర్వహణ పరిస్థితులు ఏమిటి? ఆయా ప్రాజెక్టుల్లో నీటి నిలువలు వంటి కీలకమైన అంశాలపై సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ ముందుచూపు లేకపోవటంవల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నది.
గోదావరి నదిపై ఉన్న సమ్మక్క బరాజ్ (తుపాకులగూడెం ) వద్ద సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై అనుమానాలు కలుగుతున్నాయి. ఆ అనుమానాల్లో ప్రధానంగా బరాజ్ వద్ద నీటి నిలువ కాగా, మరోటి కెనాల్ సిల్ట్ పూర్తిగా తీయకపోవడం. బరాజ్ వద్ద గత సంవత్సరం 79 మీటర్ల నుంచి 80 మీటర్ల వరకు నీటి నిలువను మెయింటెన్ చేసేది. కానీ, ఈ సంవత్సరం గోదావరికి ఇన్‌ఫ్లో ఉన్నా 75 మీటర్ల నుంచి 76 మీటర్ల వరకు మాత్రమే ఆ లెవల్స్‌ను మెయింటెన్ చేస్తున్నారు.
గోదావరి గర్భం నుంచి ఇన్‌టెక్‌వెల్‌కు ఉన్న 200 మీటర్ల కాలువకు ఈసారి పూర్తిస్థాయిలో సిల్ట్ తీయలేదని అనుమానాలు కలుగుతున్నాయి. సిల్ట్ తీయకపోవటం, బరాజ్ వద్ద నీటి నిలువ సామర్థ్యాన్ని తగ్గించటం నీటిని దిగువకు విడుదల చేయటం కోసమేననే ఆరోపణలున్నాయి. తన గురువు చంద్రబాబు కండ్లల్లో ఆనందం నింపడం కోసమే రేవంత్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. హరీశ్‌రావు విమర్శించిన తెల్లారే సీఎం హుటాహుటిన దేవాదుల పర్యటన ఖరారు కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
దేవాదుల ప్రాజెక్టులోని బీంఘన్పూర్ పంప్ హౌస్ వద్ద 2,160 క్యూసెకులు తీసుకునే సామర్థ్యం ఉన్నా కేవలం 1,700 క్యూసెక్కులనే ఎత్తిపోస్తున్నారని, తక్కిన 1,000 క్యూసెక్కులు కిందికి వదులుతున్నారని హరీశ్‌రావు లెక్కలు సహా సర్కార్ నీటి వినియోగం నిర్లక్ష్యం వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని బయటపెట్టారు. భీంఘన్‌పూర్‌లో మొత్తం 10 మోటర్లు ఉంటే ప్రస్తుతం నడుపుతున్నది 6 మోటర్లే. గండిరామారం లిఫ్ట్‌ను ఆపేశారని, తెలంగాణ హకులు కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహించిన తెల్లారే సీఎం దేవాదుల పర్యటనకు బయలుదేరడం చర్చనీయాంశమైంది.
దేవాదుల ప్రాజెక్టు సందర్శనకు రేవంత్‌రెడ్డి ఆదివారం పర్యటించనున్న నేపథ్యంలో ములుగు జిల్లా రెవెన్యూ, పోలీసు, నీటిపారుదల శాఖలు శనివారం కన్నాయిగూడెంలో వా లాయి. దేవాదుల ప్రాజెక్ట్ స్థలాన్ని ములుగు జిల్లా అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, నీటిపారుదల శాఖ ఈఈ శంకరయ్య, ఆర్డీవో వెంకటేశ్ సందర్శించారు. ప్రాజెక్ట్ ఆవరణలోని అధికారుల సమావేశ ప్రాంతం, హె లిప్యాడ్, గోదావరినది వ్యూ పాయింట్‌ను పరిశీలించారు. సీఎం పర్యటనకు దేవాదుల ప్రాం తానికి రావాలని కార్యకర్తలకు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడం గమనార్హం.
మాజీ మంత్రి హరీశ్‌రావు పర్యటనతో సీ ఎం రేవంత్‌రెడ్డి నిద్రలేచారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. గోదావరినదిలో సరిపడా నీళ్లున్నా ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులు కడగండ్లపాలవుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలోనే 90 శాతం పూర్తి అయిన దేవాదుల ప్రాజెక్టులోని మిగిలిన కొద్దిపాటి పనులను పూర్తి చేయడానికి రేవంత్ సర్కార్‌కు రెండున్నరేండ్లు సరిపోవడం లేదని మండిపడ్డారు.