మంచిర్యాల, ఫిబ్రవరి 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో ప్రజాతీర్పును గౌరవించాలని, ప్రజాస్వామ్యం ఖూనీ కాకుండా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుపాలంటూ పోరాటం చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కత్తిగట్టింది. అక్రమ కేసులు బనాయించి, అరెస్టు చేయించి, జైలుకు పంపినా సంతృప్తి చెందకుండా.. జైలులో ఉన్న సుమన్‌ను వేధిస్తున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జైలులో రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారంటూ తనను కలిసేందుకు వెళ్లిన సన్నిహితులు, న్యాయవాదులతో సుమన్ చెప్పినట్టు తెలిసింది. పోలీసులు, జైలు అధికారులను ప్రభుత్వం సుమన్ మీదికి ఉసిగొల్పిందని, జైలులో అపరిశుభ్ర గదిలో ఒంటరిగా ఉంచి భయభ్రాంతులకు గురిచేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.
తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నా పట్టించుకోకుండా, కనీసం వైద్య పరీక్షలు చేయించకుండా వేధిస్తున్నారని, నడుమునొప్పి ఉన్నదని, ఒక్క కుర్చీ ఇవ్వండని కోరినా జైలులో ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వాపోయారట. సమయానికి భోజనం పెట్టడం లేదని, పెట్టిన భోజనం నాణ్యతగా ఇవ్వకుండా మానసిక క్షోభకు గురిచేస్తున్నారని చెప్పినట్టు తెలిసింది. కనీసం బీపీ ట్యాబ్లెట్లు ఇవ్వడం లేదని, ఏది అడిగినా ఉన్నతాధికారుల నుంచి అనుమతి కావాలంటూ దబాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. రిమాండ్ ఖైదీని శిక్ష అనుభవించే ఖైదీ కంటే హీనంగా చూస్తున్నారని, ప్రభుత్వం తన అరాచక పర్వాన్ని జైలులోనూ కొనసాగిస్తున్నదని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఒక్క మున్సిపల్ పీఠం కోసం ఇంతలా అరాచకాలు చేయాలా? రోజురోజుకూ ఇంతలా దిగజారాలా? తెలంగాణ ఉద్యమనేత అని కూడా చూడకుండా వేధింపులకు గురిచేస్తారా? ఇదేనా ప్రజాపాలన.. ఇదేనా ప్రజాతీర్పునకు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చే గౌరవం? అంటూ బాల్క సుమన్ అభిమానులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
క్యాతనపల్లిలో పోలీసుల అరాచకాలు పెచ్చుమీరిపోతున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ మెప్పుకోసం, ముఖ్యంగా మంత్రి వివేక్ కండ్లల్లో ఆనందం కోసం బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా చేసుకొని కేసులు నమోదు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. విధులను ఆటంక పరచడం, భయభ్రాంతులకు గురి చేయడం, రాళ్లతో దాడి చేశారని బాల్క సుమన్‌తో పాటు బీఆర్ఎస్ నాయకుడు మూల రాజిరెడ్డి, అనిల్, లక్ష్మీకాంత్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరో ఐదుగురు బీఆర్ఎస్ నాయకుల పేర్లను చేర్చగా, తాజాగా మరో కేసు పెట్టించి దాదాపు 20మంది బీఆర్ఎస్ నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతటితో ఆగకుండా కేసులో ఉన్న నాయకులందరినీ అరెస్టు చేయించి జైలుకు పంపించేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.
ఈ మేరకు కోర్టులో పిటిషన్ సైతం దాఖలు చేశారు. దీంతో మంచిర్యాల పోలీసుల తీరుపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. బాల్క సుమన్‌ను, బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసిన రాళ్లదాడి ఘటనలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారని స్థానికులు చెప్తున్నారు. క్యాతనపల్లి ఫ్లైఓవర్ దగ్గర శాంతియుత పద్ధతిలో పోలీసులతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులపైకి ముందు రాళ్లు విసిరిందే కాంగ్రెస్ నాయకులు అని పేర్కొన్నారు. వాళ్లు రాళ్లు వేశాకే ప్రతిఘటించడం కోసం బీఆర్ఎస్ నాయకులు ఎదురు తిరిగారని, చేతికి దొరికిన వస్తువులతో కొట్లాడారని అంటున్నారు. ఏ వీడియో చూసినా బీఆర్ఎస్ నాయకుల సమూహం మీదికి వస్తున్న రాళ్లు కనిపిస్తున్నాయన్నారు.
బాల్క సుమన్ అసలు రాయే పట్టుకోలేదని, ఆయన మీదకు కాంగ్రెసోళ్లు విసిరిన ట్రాఫిక్ కోన్‌ను తిరిగి అటువైపు వేశారని స్పష్టం చేస్తున్నారు. దానికి పోలీసులు రాళ్ల దాడి అని రంగుపులుమి, ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమ కేసు పెట్టి బీఆర్ఎస్ నాయకులకు జైలుకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదే ఘటనలో రాళ్లు విసిరిన కాంగ్రెస్ నేతలపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు.
మంచిర్యాల పోలీసులు బాల్క సుమన్ కస్టడీ కోరుతూ పిటిషన్ వేసినట్టు తెలిసింది. ‘పెట్టిందే అక్రమ కేసు. దానిని నిరూపించే ఆధారాలేవి లేవు. అరెస్టు సమయంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలేవి పాటించకుండా బాల్క సుమన్‌ను జైలుకైతే పంపారు. ఇప్పుడు సరైన ఆధారాలు సమర్పించకపోతే పెట్టింది తప్పుడు కేసని తేలిపోతుందని, ఆయన బెయిల్‌పై బయటికి వస్తారని, ఎలాగైనా రిమాండ్‌ను మరికొన్ని రోజులు పొడిగించాలనే కుట్రలో భాగంగానే కస్టడీ పిటిషన్ వేశారు’ అని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. రాళ్ల దాడి ఎందుకు జరిగింది? ఏ ఉద్దేశంతో జరిగింది? అనే అంశాలను లోతుగా విచారణ చేయాల్సి ఉన్నదని, అందుకు నాలుగు రోజులపాటు సుమన్‌ను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేసినట్టు చెప్తున్నారు. దానికి స్పందనగా బాల్క సుమన్ తరఫు న్యాయవాదులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.
కేసు విచారణ పూర్తయ్యిందని, కేసు నమోదు చేసిన పోలీసు అధికారే ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఉన్నారని, కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం లేదని, బాల్క సుమన్‌కు బెయిల్ ఇవ్వాలని పిటిషన్లో కోరినట్టు న్యాయవాది మల్లేశ్ గౌడ్ తెలిపారు. ఒకవేళ తప్పదు అనుకుంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి సన్‌రైజ్ టూ సన్‌సెట్(సూర్యుడు ఉన్నంత సేపే) అది కూడా లాయర్ల ఆధ్వర్యంలో విచారించాలని కోరామన్నారు. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్, బాల్క సుమన్ న్యాయవాదులు వేసిన బెయిల్ పిటిషన్లు సోమవారం విచారణకు రానున్నాయి.
మరోవైపు ఈ నెల 11న తేదీన పోలింగ్ జరుగుతున్న సమయంలో మంత్రి వివేక్ చెన్నూర్ మున్సిపాలిటీలో ద్విచక్రవాహనంపై తిరుగుతూ ప్రచారం చేస్తూ, ఓటర్లను ప్రలోభపెడుతున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరలైన విషయం తెలిసిందే. మంత్రి తీరును నిరసిస్తూ బాల్కసుమన్ చెన్నూర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల కండువాలతో ఆందోళన చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు క్రైమ్ నెంబర్ 37/2026లో బాల్క సుమన్ రిమాండ్ కోరుతూ పీటీ వారెంట్ తీసుకున్నట్టు తెలిసింది. దీంతో సోమవారం ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది.
బాల్క సుమన్ ఎమ్మెల్యేగా, ఎంపీగా, ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. ఆయనకు ఓ ప్రొటోకాల్ ఉండాలి. కానీ జైలులో కనీసం సాధారణ వ్యక్తికి కల్పించే వసతులు కూడా సర్కార్ కల్పించడం లేదని తెలిసింది. జైలు అధికారుల ప్రవర్తన చూస్తే ఈ ప్రభుత్వం కక్షగట్టి వారిపై ఒత్తిడి చేయించి.. ఆయన్ను ఒంటరిగా ఉంచండి, నిద్రపోనివ్వకండి, దోమల్లో పడుకోబెట్టండి, సరైన సమయానికి భోజనం పెట్టకండి, ఏం అడిగినా ఇవ్వకండని చెప్పినట్టు ఉన్నది. ఇలాంటి కక్షసాధింపు చర్యలు చేపట్టడం అన్యాయం, అమానుషం. కక్షసాధింపు చర్యలపై కోర్టును ఆశ్రయిస్తాం. బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకునేలా చేస్తాం.
బాల్క సుమన్‌ను ప్రభుత్వం టార్గెట్ చేసిందా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. రాష్ట్రంలో ఎన్నో ముఖ్యమైన కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. చాలా కేసుల్లో ప్రత్యేక పీపీని నియమించాలంటూ పెట్టుకున్న వినతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కానీ బాల్క సుమన్ కేసును మాత్రం ‘ప్రత్యేకంగా’ తీసుకున్నది. ఆయనపై నమోదైన క్రైమ్ నెంబర్ 40/2026 కేసు కోసం ఎన్ రవీందర్ అనే అడిషనల్ పీపీ గ్రేడ్-2ను నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సాంబశివరెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం బాల్క సుమన్ కేసును ఇంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రత్యేక పీపీని నియమించడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఇంత అత్యవసరంగా స్పెషల్ పీపీని నియమించాల్సిన అవసరం ఏం వచ్చిందంటూ పలువురు న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. ఇదేమైనా దేశద్రోహం కేసా? బాల్క సుమన్ ఏమైనా తీవ్రవాదా? దేశానికి ఏదైనా నష్టం కలిగించారా? అని మండిపడుతున్నారు.
అండగా ఉంటాం.. అధైర్యపడకండి.. బీఆర్ఎస్ నాయకుల కుటుంబాలకు హరీశ్‌రావు భరోసా
క్యాతనపల్లి మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో ఉన్న బీఆర్ఎస్ నాయకుల కుటుంబసభ్యులతో మాజీ మంత్రి హరీశ్‌రావు శనివారం ఫోన్లో మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ మందమర్రి పట్టణ సెక్రటరీ జనరల్ బండారు సూరిబాబు సతీమణి జయరాణి, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ సతీమణి ఉమతోపాటు బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు బెల్లం అశోక్, సీపెల్లి సాగర్, బెల్లం అరుణ్, ఎండీ ముస్తఫా కుటుంబ సభ్యులను హరీశ్ రావు ఫోన్లో పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు కౌన్సిలర్ బొమ్మ భూమయ్య గౌడ్ ఇంటికి సింగరేణి అధికారులు, రెవెన్యూ సిబ్బంది వెళ్లి దౌర్జన్యం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి అధికారులతో ఫోన్లో మాట్లాడి మున్సిపాలిటీలో జరుగుతున్న విషయాలతో సింగరేణికి సంబంధం లేదని, పద్ధతి మార్చుకోకపోతే సహించేది లేదని ఆయన హెచ్చరించినట్టు స్థానిక బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.