హనుమకొండ సబర్బన్, మార్చి 3 : సంప్రదాయ వ్యవసాయ రంగంలోకి 1958లో ప్రవేశించిన యూరియా.. సేద్యంలో అత్యంత కీలకంగా మారింది. యూరియా లేకుంటే పంట పొలాలకు ప్రాణం లేనట్లే.. యూరియా కోసం గతంలో క్యూలైన్లలో తొక్కిసలాటలు జరిగి పలువురు రైతులు చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. యూరియా కొరత వల్ల పలు ప్రభుత్వాలు కూలిపోయిన ఉదంతాలూ ఉన్నాయి. ఇప్పటికీ వ్యవసాయ రంగంలో యూరియాదే అగ్రస్థానం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో ఘన రూప యూరియాకు ప్రత్యామ్నాయంగా ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కో ఆపరేటివ్ (ఇఫ్కో) సంస్థ ఇటీవలే ద్రవరూప యూరియాను ప్రవేశపెట్టింది. దీన్ని ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా విక్రయిస్తున్నది.
ఒక్క యూరియా బస్తా ప్రస్తుతం మార్కెట్లో రూ.290 నుంచి రూ.300 వరకు అమ్ముతున్నారు. అరలీటర్ ద్రవ రూప యూరియా రూ. 230 నుంచి రూ.240కి లభిస్తుంది. ఎకరాకు ఇది సరిపోతుంది. గుళికల యూరియా ప్రభావం మొక్కపై కేవలం రెండు మూడు రోజులు మాత్రమే ఉంటుంది. అదికూడా 30 శాతమే వినియోగమై మిగతాది ఆవిరైపోతుంది. అదే ద్రవ రూప యూరియా మాత్రం ఎనిమిది రోజుల పాటు దాని ప్రభావాన్ని మొక్కలపై చూపుతుంది. ఎలాంటి వృథా ఉండదు. లీటరు నీటికి నాలుగు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. దీని వల్ల నత్రజని నేరుగా మొక్కల పత్రహరితాల్లోకి చొచ్చుకు పోతుంది.ఈ నానో యూరియా మార్కెట్లోకి ప్రవేశించి ఏడాది కావస్తున్నా ఈ మధ్యకాలంలోనే జిల్లా మార్కెట్లో లభిస్తున్నది. దీన్ని వాడేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు డీఏపీని సైతం ఇదే కంపెనీ ద్రవ రూపంలో తెచ్చినా ఇంకా బహిరంగ మార్కెట్లోకి విడుదల చేయలేదు.
నానో యూరియా అమ్మకాలను ఇటీవలే మా షాపు లో చేపట్టాం. రైతులు ఆసక్తిగా ఈ ద్రవ రూప యూరి యా గురించి తెలుసుకుని తీసుకెళ్తున్నారు. కొందరు దీన్ని వాడిన వారు మళ్లీ వచ్చి పంటకు బాగా పని చేస్తోందని చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఈ యూరియాకు ఆదరణ పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
– మునిగడప లావణ్య, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం నిర్వాహకురాలు
ముల్కనూరు కో ఆపరేటివ్ బ్యాంకుతో పాటు ఆయా మండలాల్లో ఉన్న రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్‌లలో స్టాక్ ఉంచి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. అర లీటర్ ప్యాకింగ్‌తో ఇది లభిస్తుంది. అర లీటర్ బాటిల్ 45కిలోల ఘనరూప యూరియాతో సమానమని కంపెనీ చెబుతున్నది. ఇది దేశంలోని పలు విశ్వవిద్యాలయాలతో పాటు సెలెక్టెడ్ రైతులకు సంబంధించిన 11వేల ప్రాంతాల్లో 90కిపైగా పంటలపై ప్రయోగించిన తర్వాత మార్కెట్లోకి విడుదల చేసినట్లు పేర్కొంది. దీన్ని రవాణా చేయడం సులభతరంగా ఉంటుంది. జేబులో పెట్టుకొని ఎకరాకు సరిపోయే యూరియాను తీసుకెళ్లవచ్చు. దీన్ని స్ప్రే చేస్తే నేరుగా పంట ఆకులపై పడి మొక్కకు త్వరగా నత్రజని అందుతుంది.
రైతులు తమ పంట పొలాల్లో యూరియాను పెద్ద ఎత్తున వినియోగిస్తారు. ఇప్పుడు ఇఫ్కో కంపెనీ ప్రవేశపెట్టిన ద్రవ రూప యూరియా వల్ల అనేక లాభాలున్నాయి. రైతులకు రవాణా ఖర్చు పూర్తిగా తగ్గడంతోపాటు కొనుగోలు ఖర్చు కూడా కొంత ఆదా అవుతుంది. భూమిలో అధిక రసాయనాల వినియోగం కూడా తగ్గిపోతుంది. నేరుగా పంటకు అందుతుంది. వ్యవసాయ రంగంలో ద్రవరూప యూరియా ఒక విప్లవాత్మకమనే చెప్పొచ్చు.
– దామోదర్‌రెడ్డి, ఏడీఏ, హనుమకొండ
నేను ఇటీవలే ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో నానో యూరియా తీసుకొచ్చి పంట చేనులో పిచికారీ చేశాను. అంతకుముందు గుళికల యూరియా మాదిరిగానే పని చేసింది. పురుగు మందులు స్ప్రే చేసిన సమయంలో ఈ నానో యూరియాను వాడుకుంటే పంటకు ఉపయోగకరంగా ఉంటుంది. పంట కూడా బాగుంది.
– అల్లకొండ రాజు, రైతు