స్వతంత్ర భారత వజ్రోత్సవాలు పండుగ వాతావరణంలో సాగుతున్నాయి. రెండో రోజైన మంగళవారం ఉమ్మడి జిల్లా అంతటా ఇంటింటికీ మువ్వన్నెల జెండాల పంపిణీ చేయగా పలుచోట్ల ఇళ్లపై జాతీయ జెండాలు సగర్వంగా ఎగిరాయి. జనగామ కలెక్టరేట్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించించగా, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, కలెక్టర్ శివలింగయ్య పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరినీ భాగస్వామిని చేయాలని ఎర్రబెల్లి సూచించారు. అలాగే హనుమకొండలోని టౌన్ హాల్లో చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, కమిషనర్ ప్రావీణ్య, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్ రాజ్, జడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్ పాల్గొని పలువురికి జెండాలు పంపిణీ చేశారు.
స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని ఎలుగెత్తి చాటాలని సమరయోధుల త్యాగాలను, మహాత్మాగాంధీ చరిత్రను భావితరాలకు తెలియజేయాలని దాస్యం సూచించారు. అలాగే భూపాలపల్లిలోని ఊర్వశి థియేటర్లో విద్యార్థులతో కలిసి గాంధీ చిత్రాన్ని తిలకించిన కలెక్టర్ భవేశ్ మిశ్రా.. ఆ తర్వాత స్వాతంత్య్ర పోరాటంలోని కొన్ని సన్నివేశాలను వారికి వివరించారు. అలాగే మహబూబాబాద్‌లో కలెక్టర్ శశాంక ఇంటింటికీ వెళ్లి మువ్వన్నెల జెండాలను పంపిణీ చేయగా ప్రజలను అందుకొని మురిసిపోయారు.