kidnap | సుబేదారి, (వరంగల్): చిన్న పిల్లల కిడ్నాప్‌నకు పాల్పడిన ఇద్దరు నిందితులను వరంగల్ పోలీసు కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్, కాజీపేట పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. శనివారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులను వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.
ఈ కేసుపై సీపీ మాట్లాడుతూ.. పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్‌కు చెందిన కొడపాక నరేష్, పెద్దపల్లి టౌన్ శాంతి నగర్‌కు చెందిన వేల్పుల యాదగిరి కారులో డిసెంబర్ 28న వరంగల్‌కు వచ్చారు. కాజీపేట రైల్వేస్టేషన్ బయట నిద్రిస్తున్న కన్నా నాయక్ (5నెలల) బాలుడిని కిడ్నాప్ చేశారు.
అలాగే ఈ ఇద్దరు నిందితులు డిసెంబర్ 28న జన్నారం మండలం లింగయ్యపల్లి ఐదు నెలల బాబును, గత ఏడాది ఆగస్టులో వరంగల్ రైల్వే స్టేషన్లో తల్లిదండ్రులతో నిద్రిస్తున్న 10 నెలల పాపను, 2023 అక్టోబర్ లో కాజీపేట ప్లాట్‌ఫాం మీద నిద్రిస్తున్న 3 సంవత్సరాల బాబును, 2025 అక్టోబర్‌లో మంచిర్యాల ,2025 జూన్‌లో రామగుండం రైల్వే స్టేషన్ లో తల్లిదండ్రులతో నిద్రిస్తున్న 10 నెలల పాపను కిడ్నాప్ చేసి వేర్వేరు ప్రాంతాల్లో అమ్మేశారన్నారు.
విచారణ చేపట్టి ఐదుగురు పిల్లలను రెస్క్యూ చేయడం జరిగిందని సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. పేరెంట్స్ బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల వద్ద పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి అని సీపీ సూచించారు.