MGM| వరంగల్ చౌరస్తా: వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో కలెక్టర్ డాక్టర్ సత్య శారద తనిఖీలు నిర్వహించారు. జనప్రియ, బిలియన్ హార్ట్స్ బీటింగ్ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆమె ఎంజీఎం వార్డులను కలియ తిరిగారు. కార్డియాలజీ విభాగంలోని ఫిర్యాదుల పెట్టేను తెరిచి ఫిర్యాదులను పరిశీలించారు. విద్యకు, నర్సింగ్ ఆఫీసర్లు రోగుల పట్ల కటువుగా ప్రవర్తిస్తున్నారని ఉన్న పిర్యాదును వైద్యులకు, నర్సింగ్ సిబ్బందితో చదివించి, రోగులను పట్ల మానవతా దృక్పథంతో చూడాలని అన్నారు.
టూ డీ ఈకో సెంటర్ ను పరిశీలించి మరమ్మత్తులో ఉన్న మరో యంత్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అనంతరం డైక్ సెంటర్ని పరిశీలించారు. శానిటేషన్ విధుల్లో తప్పనిసరిగా షిఫ్టుల విధానాన్ని కొనసాగించాలని ఆదేశించారు. అటెండెంట్ వెయిటింగ్ హాల్ ని పరిశీలించి, రికార్డ్స్ తనిఖీ చేశారు. అనంతరం ఓపీ విభాగంలోని అర్డోపెడిక్ విభాగంలో రోగులు వేచివున్నప్పటికీ వైద్యులు అందుబాటులో లేకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓపీ ల్యాబ్ (47) ను సందర్శించి ఏ రోజు శాంపిల్స్ కి సంబంధించిన రిపోర్ట్స్ అదే రోజు అందించేలా పని చేయాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయానికి అవకాశంవున్న చెట్ల కొమ్మలను తొలగించాలని, ఎంసిహెచ్ వార్డు పక్కన నిరుపయోగంగావున్న బావిని పూడ్చడానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ కుమార్, ఆర్ఎంఓ డాక్టర్ శశికుమార్, పలు విభాగాల అధిపతులు, ఆర్డీఓ, డీఎంహెచ్ఓ, తదితరులు పాల్గొన్నారు.