వరంగల్, జనవరి 28 : వరంగల్ మహా నగర ప్రజలకు రెండున్నర దశాబ్దాల క్రితం హాలీడే స్పాట్‌గా ఉన్న మ్యూజికల్ గార్డెన్‌కు పూర్వ వైభవం రానుంది. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మ్యూజికల్ గార్డెన్ రెనోవేషన్ పనులు చకచకా సాగుతున్నాయి. కొన్ని సంవత్సరాలుగా సందర్శకులు లేక వెలవెలబోయిన గార్డెన్‌కు కొత్త కళ తీసుకొచ్చేందుకు కుడా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. రెండున్నర దశాబ్దాల కిత్రం వరంగల్ నగరంలో పబ్లిక్ గార్డెన్, వన విజ్ఞాన్ తర్వాత మ్యూజికల్ గార్డెన్ మాత్రమే విహార కేంద్రాలుగా ఉండేవి. అయితే, ప్రస్తుతం భద్రకాళి బండ్, వడ్డేపల్లి బండ్ లాంటి అనేక పార్కులు నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. స్మార్ట్‌సిటీగా మారుతున్న నగరంలో మ్యూజికల్ గార్డెన్‌ను మరింత అభివృద్ధి చేయాలన్ని సంకల్పంతో కుడా అధికారులు పునరుద్ధరణకు శ్రీకారం చేపట్టారు. రెండు నెలలుగా మ్యూజికల్ గార్డెన్లో పాత్‌వేలు, బ్రిడ్జిలు, కాఫిటేరియా, గ్రీనరీ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే గార్డెన్ చుట్టూ ప్రహరీ పనులను కుడా అధికారులు పూర్తి చేశారు. త్వరలోనే మ్యూజికల్ గార్డెన్ పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.
మళ్లీ మ్యూజికల్ ఫౌంటేన్ ప్రారంభం..
మ్యూజికల్ గార్డెన్లో మళ్లీ సంగీత ఫౌంటేన్ మొదలు కానుంది. కొన్ని సంవత్సరాలుగా మూగబోయిన మ్యూజికల్ ఫౌంటేన్‌ను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో మ్యూజికల్ ఫౌంటేన్ నుంచి వచ్చే సంగీతం వినడానికి వందల సంఖ్యలో సందర్శకులు వచ్చేవారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి పాఠశాలల విద్యార్థులు విహారయాత్ర పేరుతో మ్యూజికల్ గార్డెన్‌కు వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ప్రస్తుతం అధికారులు మ్యూజికల్ గార్డెన్‌కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు దృష్టి సారించడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే స్మార్ట్‌సిటీలో భాగంగా మ్యూజికల్ గార్డెన్ ముందు నుంచి స్మార్ట్‌రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. ఎంజీఎం కూడలి నుంచి బట్టల బజార్‌కు వెళ్లే ప్రధాన రహదారిని కలుపుతూ కార్పొరేషన్ కార్యాలయం నుంచి మ్యూజికల్ గార్డెన్ మీదుగా భద్రకాళి రోడ్డును కలిపేలా స్మార్ట్‌రోడ్డు నిర్మాణంతో ఆ ప్రాంతానికి కొత్త కళ వచ్చింది. దీనికి తోడు మ్యూజికల్ గార్డెన్ పక్కన ఉన్న ప్రతాపరుద్ర ప్లానిటోరియం పునరుద్ధరణకు గ్రేటర్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సమీపంలోనే భద్రకాళి దేవాలయం ఉండడం కుడా నగర ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు హాలీ డే స్పాట్‌గా మారనుంది.
రూ. 2 కోట్లతో పనులు,,
మ్యూజికల్ గార్డెన్‌ను రూ. 2 కోట్లతో రెనోవేషన్ చేస్తున్నారు. కుడా ఆధ్వర్యంలో పనులు సాగుతున్నాయి. శిథిలావస్థలో ఉన్న ప్రహరీ స్థానంలో కొత్తది నిర్మించారు. దీంతో పాటు గార్డెన్లో పాత్‌వేలను నిర్మాణం చేస్తున్నారు. గార్డెన్‌కు వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేకంగా కాఫీటేరియాతో పాటు గార్డెన్లో గ్రీనరీ పెంపొందించేందకు అధికారులు ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. విరిగిపోయిన పిల్లల ఆట వస్తువుల స్థానంలో కొత్త ఆటవస్తువులను ఏర్పాటు చేస్తున్నారు. నగర ప్రజలకు పూర్తి స్థాయి ఆహ్లాదాన్ని అందించేలా మ్యూజికల్ గార్డెన్‌ను తీర్చిదిద్దనున్నారు. కాకతీయుల రాజధాని ఓరుగల్లు నగరంలో మళ్లీ కాకతీయ మ్యూజికల్ గార్డెన్‌కు పూర్వ వైభవం తీసుకురానున్నారు.