గీసుగొండ, మే 25: అక్రమగా నల్ల మట్టిన తరలిస్తున్న టిప్పర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. గీసుకొండ మండలంలోని మనుగొండ చెరువు, ఆత్మకూరు మండలంలోని పెద్దాపురం చెరువుల నుంచి నల్లమట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వుతూ రాత్రి వేళల్లో ఇటుక బట్టీలకు తరలిస్తుండగా మనుగొండ గ్రామస్తులు మట్టిలోడుతో వెళుతున్న ఏడు టిప్పర్లను అడ్డుకున్నారు. రాత్రి వేళల్లో భారీ శబ్దాలతో మట్టిలోడుతో వెళ్తున్న టిప్పర్లు గ్రామం నుంచి వెళుతుండటంతో ప్రజలకు నిద్ర పట్టడం లేదని వేదన వ్యక్తం చేశారు.
ప్రతిరోజు రాత్రి వేళల్లో విపరీతంగా మట్టి ఇటుక బట్టీలకు, వరంగల్ కు తరలిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కొండా వర్గం నాయకులు వీరగోని రాజకుమార్, అల్లం బాలకిషోర్ రెడ్డి టిప్పర్లను అడ్డుకొని వాటిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు చేయలేదని వారు తెలిపారు. అక్రమ మట్టి తరలింపు గీసుకొండ పోలీసుల కనుసైగల్లో జరుగుతుందని వారు ఆరోపిస్తున్నారు.