బచ్చన్నపేట, నవంబర్ 21 : సమాజ పురోభివృద్ధికి ఆటంకంగా మారిన మూఢవిశ్వాసాలను పారద్రోలడంలో జనవిజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమని బచ్చన్నపేట్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకట్ రెడ్డి అన్నారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన చెకుముకి మండల స్థాయి పోటీలు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఒక వైపున పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా మూఢనమ్మకాల కోసం ప్రచార జాతాలను నిర్వహిస్తున్నారని, జనవిజ్ఞాన వేదిక లాంటి సంస్థలు కూడా విశేషంగా కృషిచేస్తున్నాయని అన్నారు. పిల్లలలో శాస్త్రీయ విజ్ఞాన పెంపు కోసం చెకుముకి లాంటి పరీక్షలు ఉపకరిస్తాయని అన్నారు.
నేర్చుకున్న జ్ఞానాన్ని నిజ జీవితంలో అమలు చేయాలని, విద్యార్థి దశ నుండి సైన్స్ పట్ల మక్కువ కలిగివుండాలని పిలుపునిచ్చారు. జేవీవీ జిల్లా కార్యదర్శి రసాల బాల్ రాజ్ మాట్లాడుతూ పాఠశాల స్థాయి పరీక్షలను మండలంలోని 15 పాఠశాలల్లో నిర్వహించామని తెలిపారు. మండల స్థాయి పరీక్షలకు మండలంలోని 15 పాఠశాలల నుండి విద్యార్థులు హాజరయ్యారని వీటినుండి 4 టీం లు డిసెంబర్ 28 వ తేదీన జరిగే జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించాయాని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నర్సింహా రావు, జెవీవీ బాధ్యులు సుధీర్ రెడ్డి, కృష్ణమూర్తి, యాదగిరి, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు జీవన కుమారి, అంకుశావలి, నరసింహులు, సోమన్న, తదితరులు పాల్గొన్నారు.